ఏసీబీకి చిక్కిన తహసీల్దార్.. భూమి బదలాయింపునకు రూ.50 వేలు డిమాండ్

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్..    భూమి బదలాయింపునకు రూ.50 వేలు డిమాండ్
  • కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ఘటన

లింగంపేట, వెలుగు: తండ్రి పేరుపై ఉన్న భూమిని బదలాయింపు చేసేందుకు లంచం డిమాండ్​ చేసిన తహసీల్దార్​ ఏసీబీకి పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని  ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన తండ్రి పేరుపై ఉన్న ఎకరంన్నర భూమిని తన పేరుకు బదిలీ చేయాలని నాగిరెడ్డిపేట తహసీల్దార్​ యార్లగడ్డ శ్రీనివాసరావును కోరాడు. ఇందుకు తహసీల్దార్​ రూ.50 వేలు డిమాండ్​ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

మంగళవారం రూ.50 వేలు ఇవ్వడానికి తహసీల్దార్​ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్​ ఆఫీస్​లో ప్రైవేట్​గా పనిచేసే చీనూరి అజయ్​ అనే యువకుడికి డబ్బులు ఇవ్వాలని తహసీల్దార్​ సూచించడంతో బాధితుడు ఆయనకు రూ.50 వేలు అందజేశాడు. అక్కడే కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు  రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. తహసీల్దార్​శ్రీనివాసరావు, చీనూరి అజయ్​ను అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్​ తెలిపారు. వీరిని నాంపల్లిలోని ఏసీబీ అడిషనల్​ స్పెషల్​ జడ్జి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిపారు.