మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే నెల 4, 5 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం హాజిలాపూర్ గ్రామ సమీపంలో రూ.32.05 కోట్లతో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు మంత్రి వాకిటి శ్రీహరి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి శనివారం భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లిఫ్ట్ స్కీం ద్వారా 1,400 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. జూన్ 4న జూరాల నుంచి మొదలుకొని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, నార్లాపూర్, ఉదండాపూర్ రిజర్వాయర్లను సందర్శిస్తామని చెప్పారు. పర్యటనలో భాగంగా భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ సమస్యలు, పెండింగ్ పనుల వివరాలు సేకరించి, నిధులు విడుదల చేసి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పాలమూరు ప్రాజెక్టులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే శ్రద్ధ పెట్టిన బీఆర్‌ఎస్.. పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేసిందని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు గత ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఈ నిధులతోనే 90 శాతం పనులు చేశామని బీఆర్‌ఎస్ లీడర్లు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.57 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన పనులకు.. రూ.27 కోట్లే ఖర్చు చేస్తే 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి పాల్గొన్నారు.
