- ధాన్యం పూర్తిస్థాయి కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు రైతులను అయోమయంలోకి నెట్టేలా అసత్య ప్రచారం చేయవద్దని ఆయన హెచ్చరించారు. బుధవారం సెక్రటేరియెట్ లో మీడియాతో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోందని, కొనుగోళ్లు సైతం వేగంగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
ఈ రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగిందని, 141 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 17.28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు రూ.2,310 కోట్లు చెల్లించామని చెప్పారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.21 వేల కోట్లను కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు.
8 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 18.75 కోట్ల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 64.83 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాములు సిద్ధం చేశామని తెలిపారు. అదనంగా 11.20 లక్షల టన్నుల నిల్వ కోసం మరిన్ని గోదాములను గుర్తించామన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు 6,200 వాహనాలను సిద్ధం చేశామని చెప్పారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని 2.63 లక్షల టార్పాలిన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. రైతులు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రత్యేక టోకెన్ వ్యవస్థ అమలు చేస్తున్నామని చెప్పారు.
అక్రమాలను సహించం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. “తాలు పేరుతో కోతలు విధించినా, తూకంలో తరుగుదల చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది రైతు ప్రభుత్వం. రైతులకు నష్టం కలిగించే ఏ చర్యనైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించదు” అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల సంఖ్య, కొనుగోలు పరిమాణం, రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరిగాయని మంత్రి వివరించారు.
2023-–24 వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 47.34 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.10,415 కోట్లు చెల్లించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం 2024–-25 ఖరీఫ్‌లో 53.95 లక్షల టన్నులు కొనుగోలు చేసి.. రూ.12,512 కోట్లు చెల్లించిందన్నారు. అదేవిధంగా 2024–-25 యాసంగిలో 10.87 లక్షల మంది రైతుల నుంచి 74.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రూ.17,198 కోట్లు చెల్లించామని తెలిపారు.
ప్రస్తుత యాసంగి సీజన్‌లో 13 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని రూ.21,501 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గణాంకాలన్నీ అధికారికంగానే విడుదల చేస్తున్నామని, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
