
హన్మకొండ: కలెక్టర్ వెరిఫై చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని.. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం (మే 3) హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చారిత్రక, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం తమదేనని.. ఎంత ఖర్చైనా సరే నిరుపేదలకు సన్న బియ్యం అన్నం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఇందులో భాగంగానే ఏ రాష్ట్రంలో పండని విధంగా తెలంగాణలో వానాకాలం, యాసంగిలో వరి పండిందని తెలిపారు. రాష్ట్రంలో 2.80 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని.. రెండు సీజన్లలో తెలంగాణలో పండినంత ధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో కూడా పండలేదన్నారు.
Also Read : పారిశ్రామిక నగరం ఈ సిటీ ఏర్పాటు
రబీ, యాసంగి సీజన్లలో సన్న ధాన్యానికి రూ.500 రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ను ఇస్తోందని.. ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. ఎఫ్సీఐకు ధాన్యం అమ్మే రాష్ట్రాలలో తెలంగాణే ముందు వరుసలో ఉందని తెలిపారు. దేవాధుల ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. దేవున్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్‌ను కూడా సందర్శించామన్నారు. భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులను, సుందరీకరణ పనులను భారీ స్థాయిలో చేపట్టామని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ఈ సీజన్లో పూర్తి చేస్తామన్నారు. రైతులకు నీరందించి సాగును సస్యశ్యామలంగా చేయడానికి కృషి చేస్తిన్నామన్నారు. రైతన్నల అద్భుతంగా పంటలను పండించారన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు అందరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు.