
- ప్రాజెక్టు రెండు ఆప్షన్లపైనా రిపోర్టు సమర్పించాలి
- మైలారం నుంచి సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్లొచ్చని వివరించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు:
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి రివైజ్డ్ డీపీఆర్‌ను ఈ నెలాఖరుకల్లా రూపొందించాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సెక్రటేరియెట్‌లో ప్రాజెక్టుపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌లో పరిశీలించిన అంశాలను అధికారులు మంత్రికి వివరించారు.
ఇప్పటికే ఉన్న 71 కిలోమీటర్ల కెనాల్ నెట్వర్క్ చెక్కు చెదరలేదని, చిన్న చిన్న రిపేర్లతో దానిని వాడుకోవచ్చని చెప్పారు. ఈ నెట్వర్క్ ద్వారా లిఫ్టుల అవసరం లేకుండానే సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకోవచ్చని చెప్పారు. కెనాల్ నెట్‌వర్క్‌లో 45 కిలోమీటర్ల మేరకు కాల్వల తవ్వకం పూర్తయిపోయిందని, మిగతా చోట కొంత మేరకు పనులు జరిగాయని మంత్రి ఉత్తమ్‌కు అధికారులు వివరించారు.
71 కిలోమీటర్ల తర్వాత మంచిర్యాల జిల్లాలోని మైలారం వద్ద నుంచి రెండు పాయింట్ల ద్వారా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం మైలారం నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకెళ్లొచ్చన్నారు. అయితే, మరో ప్రతిపాదనలో భాగంగా మైలారం నుంచి నేరుగా లిఫ్ట్ అవసరం లేకుండా 35 కిలోమీటర్ల దూరంలోని సుందిళ్లకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. సుందిళ్లకు నీటి తరలింపు టెక్నికల్‌గా, ఆర్థికంగా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.
అయితే, రెండు ఆప్షన్లపైనా డిటెయిల్డ్గా రిపోర్టు తయారు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా ఆ రిపోర్టును సబ్మిట్ చేస్తే ఒక నిర్ణయం తీసుకోవచ్చన్నారు. వచ్చే వారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్, ఇతర అధికారులతో మరోసారి రివ్యూ చేస్తామన్నారు.
సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి
సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ఇరిగేషన్ శాఖ భూములను గుర్తించాల్సిందిగా అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇరిగేషన్ లిఫ్టులు రన్చేసేందుకు వాడుకోవచ్చన్నారు. మన శాఖలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని వాడుకుంటే.. ఏటా కరెంట్ కోసం పెడుతున్న అదనపు భారం చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.
వచ్చే వారం కల్లా ఎక్కడెక్కడ ఎంత భూమి ఉందో.. ఏది అనుకూలమో ఓ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలన్నారు. డిపార్ట్మెంట్ ఖర్చుల్లో విద్యుత్ భారమే ఎక్కువగా ఉంటున్నదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏరియల్ సర్వే, దేవాదుల ప్యాకేజీ 3, కల్వకుర్తి ప్యాకేజ్ 29, పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ 7 పనులపై డిటెయిల్డ్ నోట్స్ తయారు చేయాలని, కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం కర్నాటక ప్రభుత్వం భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. కేంద్రం ముందు తెలంగాణ అభ్యంతరాలను వివరించాలన్నారు.