
- అత్యాధునిక సాంకేతికతతో పటిష్టం చేయాలి: మంత్రి ఉత్తమ్
- పోయిన పేరును తిరిగి తీసుకురావాలి
- ఐఐటీ, ఎన్ఐటీ నుంచి వచ్చినవాళ్లను తీసుకోవాలని సూచన
- సీడీవోపై అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్డిపార్ట్మెంట్లోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీడీవోలో అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీర్లను భర్తీ చేయాలని, అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టు డిజైన్లను టైమ్‌లైన్‌కు అనుగుణంగా పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. సీడీవో పనితీరు అధ్వానంగా ఉందని నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్తమ రిపోర్టుల్లో వెల్లడించాయన్నారు.
మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల విషయంలో సీడీవో విశ్వసనీయత దెబ్బతిన్నదని విచారం వ్యక్తం చేశారు. వీలైనంత తొందరగా సీడీవోలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, సీడీవో విశ్వనీయతకు భంగం కలుగుతుందంటే తాము చూస్తూ కూర్చోలేమని ఆయన తేల్చి చెప్పారు. ఎక్కడెక్కడ లోపాలున్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలని సూచించారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో సీడీవోలో చేపట్టాల్సిన సంస్కరణలపై అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్‌పాటిల్, ఈఎన్సీ జనరల్అమ్జద్ హుస్సేన్, సీడీవో సీఈ శ్రీనివాస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడీవోలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులకు మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. లేటెస్ట్సాఫ్ట్వేర్, సౌకర్యాలతో సీడీవోను పటిష్టపరచాలన్నారు. ఒకప్పుడు సీడీవో అంటే దేశానికి, రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా ఉండేదని గుర్తుచేశారు. వందేండ్ల క్రితం నిజాంసాగర్‌కు డిజైన్లను ఇచ్చిందని, ఆ తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులకూ సాంకేతిక నైపుణ్యాలను అందించిందని కొనియాడారు. ఎంతో పేరున్న విభాగానికి.. ఇప్పుడు చెడ్డ పేరు వచ్చిందని, వెంటనే సీడీవో ప్రమాణాలను పునరుద్ధరించాలని తేల్చి చెప్పారు.
ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి..
సీడీవోలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఐఐటీ, ఎన్ఐటీల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్లను సీడీవోలోకి తీసుకోవాలని, అన్ని స్థాయిల్లోనూ వారితో భర్తీ చేయాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన ప్రతిభ కలిగిన వారిని నియమించుకోవడమే కాదని, ఎక్కడ అవసరమో అక్కడ నియమిస్తేనే ప్రయోజనమని అన్నారు. అత్యంత సంక్లిష్టమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు కచ్చితత్వంతో కూడిన ఇంజనీరింగ్ నైపుణ్యం అవసరమని, అది కేవలం శిక్షణపొందిన ప్రొఫెషనల్స్తోనే సాధ్యమవుతుందని చెప్పారు.
అలాంటి వారిని సీడీవోలో నియమించుకోవడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన ఆధునిక పరికరాలు, ఫెసిలిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా సీడీవో ద్వారా అత్యున్నతమైన డిజైన్స్ ఇచ్చేలా కృషి చేయాలన్నారు. సర్వీసులో ఉన్న వారైనా లేదా రిటైర్ అయిన వాళ్లైనా సరే.. సీడీవోకు కన్సల్టెంట్ ఎక్స్‌పర్టులను నియమించాలన్నారు. రిటైర్ అయినవాళ్లలో నైపుణ్యం ఉన్నవాళ్లను చూసి ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రో మెకానికల్అంశాలపైనా కన్సల్టెంట్లను నియమించుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రో మెకానికల్ డిజైన్ పనుల విషయంలో ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, టీజీ జెన్కో వంటి సంస్థల సేవలను వినియోగించుకుంటే మంచిదన్నారు.
కాగా, సీడీవోలో ఉన్న సమస్యల గురించి అధికారులను మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. అయితే, ప్రస్తుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వివిధ పరికరాల సమీకరణ నిదానంగా సాగుతున్నదని, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా లేకుండా పోయిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వాటిపై దృష్టి సారించాలంటూ సీడీవో సీఈకి మంత్రి ఆదేశాలిచ్చారు. నెల్లికల్లు, డిండి వంటి ప్రాజెక్టుల డిజైన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటికి వీలైనంత తొందరలో సమగ్రమైన డిజైన్లను తయారు చేయాలని సీడీవో సీఈని ఆదేశించారు. డిజైన్లు ఎంత లేట్ అయితే.. నీళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రతి రోజూ నష్టపోయినట్టే అవుతుందని మంత్రి పేర్కొన్నారు.