
- కాళేశ్వరం, కృష్ణా నీళ్ల వాటాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ప్రజెంటేషన్
- బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నం: మంత్రి ఉత్తమ్
- పరీవాహక ప్రాంతం, జనాభా ఆధారంగా తెలంగాణకు 71%, ఏపీకి 29% వాటా ఉండాలి
- కానీ నాడు 34 శాతం వాటా చాలంటూ సంతకాలు చేసిందే కేసీఆర్, హరీశ్‌రావు
- కాళేశ్వరం, కృష్ణా నీళ్ల వాటాలపై మంత్రి పవర్ పాయింట్ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించేలా కృష్ణా వాటర్ డిస్ప్యూ ట్స్ట్రిబ్యునల్ 2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)లో పోరాడుతున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. పరీవాహక ప్రాంతం, జనాభా, కరువు ప్రాంతాల ఆధారంగా తెలంగాణకు 71 శాతం (575 టీఎంసీలు), ఏపీకి 29 శాతం (236 టీఎంసీలు) చొప్పున నీటి వాటాలను కేటాయించాలని ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు.
బుధవారం ప్రజా భవన్‌లో కృష్ణా నీళ్ల వాటాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. బీఆర్ఎస్హయాంలో కృష్ణా నీళ్ల వాటాల్లో జరిగిన నష్టం, కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక న్యాయమైన వాటా కోసం చేస్తున్న పోరాటాన్ని ఉత్తమ్ వివరించారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఏపీకి ఏటా 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేలా అధికారికంగా ఒప్పుకుని సంత కాలు చేసింది. 2016 సెప్టెంబర్21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో అప్పటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్‌మంత్రి హరీశ్ రావులు ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం సరిపోతాయంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చారు.
బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్అవార్డు వచ్చేంత వరకు ఇవే వాటాలను కొనసాగించాలంటూ కేఆర్ఎంబీకి 2020 జనవరి 9న లేఖ రాశారు. కానీ, మేం అధికారంలోకి వచ్చాక నీటి వాటాలు మార్చాలంటూ కేంద్రానికి లేఖ రాశాం. కృష్ణా నీళ్లలో తెలంగాణకే 71 శాతం వాటా ఉందని తేల్చి చెప్పాం. నాడు అన్యాయంగా చేసిన కేటాయింపులను సవరించాలని కేంద్రాన్ని కోరాం” అని తెలిపారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే బీఆర్ఎస్అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ నీళ్లదోపిడీ..
నీళ్ల తరలింపుకు ఏపీ ఏర్పాటు చేసుకున్న మౌలిక వసతులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘‘1987లో 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడును నిర్మించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2005లో దాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. కానీ తెలంగాణ ఏర్పడి, బీఆర్ఎస్అధికారంలోకి వచ్చాక పోతిరెడ్డిపాడును 92,592 క్యూసెక్కులకు ఏపీ పెంచుకున్నది. 2019 మే, 2020 జనవరి, 2020 జూన్‌లో ప్రగతి భవన్‌లో నాటి సీఎం కేసీఆర్‌ను అప్పటి ఏపీ సీఎం జగన్ కలిశారు.
గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై చర్చించారు. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్స్కీమ్కు శ్రీకారం చుట్టారు. వర్షాకాలం మొదట్లో వచ్చే వరదలన్నీ ఈ ప్రాజెక్టు ద్వారా తరలించుకుపోతారు. దాని వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. 2014కు ముందు ఏపీ శ్రీశైలం ద్వారా నీటిని తరలించుకుపోయే సామర్థ్యం 47,850 క్యూసెక్కులు (రోజుకు 4.1 టీఎంసీలు)గా ఉంటే.. 2014 నుంచి 2023 మధ్య బీఆర్ఎస్ హయాంలో 1,11,400 క్యూసెక్కులు (9.6 టీఎంసీలు)కు పెంచుకున్నది.
2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పడకముందు శ్రీశైలం నుంచి ఔట్సైడ్బేసిన్కు 727.15 టీఎంసీలు తరలిపోతే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ హయాంలో 1200.95 టీఎంసీలను తరలించుకున్నారు. బీఆర్ఎస్అధికారంలో ఉన్నప్పుడే ఔట్సైడ్బేసిన్కు అధికంగా నీళ్లు తరలిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాకే కృష్ణాలో అత్యధిక నీటిని వాడుకున్నాం. 2024–-25లో 286.30 టీఎంసీలు వినియోగించుకున్నాం” అని చెప్పారు.
బీఆర్ఎస్హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మరో 261 టీఎంసీలను వాడుకునేందుకు వీలుండేదన్నారు. గత సర్కార్ రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి, రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. మిగతా కృష్ణా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఫైర్అయ్యారు. దాని వల్లే ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు నష్టం జరిగిందని మండిపడ్డారు.
సోర్సు మారలే..
తుమ్మిడిహెట్టి దగ్గర కట్టినా, మేడిగడ్డ వద్ద కట్టినా నీళ్లు ఎల్లంపల్లికి రావాల్సిందేనని ఉత్తమ్ స్పష్టం చేశారు.
‘‘మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే రాద్ధాంతం చేస్తున్నారంటూ హరీశ్ అనడం హాస్యాస్పదంగా ఉంది. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులో గుండెకాయ అయిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే.. ప్రాజెక్టును ఎంత పెట్టి కట్టుకుంటే ఏం లాభం? బ్యారేజీని ప్రారంభించిన కొద్ది రోజులకే లీకేజీలు ప్రారంభమయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లలో లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిం ది.
డీపీఆర్‌లో ఒక చోట బ్యారేజీలను ప్రపోజ్ చేస్తే.. 5 కిలో మీటర్ల దూరంలో ఒక బ్యారేజీ, 3 కిలోమీటర్ల దూరంలో మరో బ్యారేజీని నిర్మించారు. ఈ ప్రాజెక్టుతోనే రాష్ట్రం మొత్తానికి నీళ్లిచ్చినట్టుగా బీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. మేంఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీటిని వాడుకోకుండానే.. 153 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించాం. యాసంగితో కలుపుకుంటే 283 లక్షల టన్నుల ధాన్యం పండింది. ఇది దేశంలోనే రికార్డ్. ఐదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు 168 టీఎంసీలు.
అందులో 63 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే వదిలేశారు. ఆవిరినష్టాలు 10 టీఎంసీలు పోనూ 92 టీఎంసీలే ఎత్తిపోశారు. కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌లకు 27 టీంఎసీలు ఇచ్చారు. మిగతా వాడుకున్నది ఐదేండ్లలో 65 టీఎంసీలే. 1.40 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారు’’ అని వివరించారు. ‘‘మేడిగడ్డలో నీళ్లను స్టోర్ చేస్తే అది పూర్తిగా కూలిపోయి భద్రాచలంతో పాటు 44 ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్ నేతలే బ్యారేజీలకు నష్టం చేసి మళ్లీ లక్షల మందితో పంపులను ఆన్ చేస్తామని చెప్పడం దుర్మార్గం. మేం వాటిని బాగు చేసి ఎలా వినియోగంలోకి తేవాలో ఆలోచిస్తున్నాం. బ్యారేజీలను శాస్త్రీయంగా రిపేర్లు చేసి వాడుకోవాలని, నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది” అని తెలిపారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం..
తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ సైట్‌ను ఎందుకు మార్చారన్న దానిపై సరైన కారణాలేవీ లేవని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు రావడానికి ముందు.. ఆ ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేసిందని చెప్పారు. ‘‘ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని 16.4 లక్షల ఎకరాలకు తుమ్మిడిహెట్టి ద్వారా రూ.38 వేల కోట్లతోనే నీళ్లు వచ్చేవి.
2010 నాటికే ఏడు జిల్లాల్లో పబ్లిక్‌హియరింగ్ కూడా అప్పట్లో మా ప్రభుత్వం పూర్తి చేసింది. రూ.11 వేల కోట్ల పనులూ పూర్తయ్యాయి. కానీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక.. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని, ముంపు సమస్య ఉందని చెప్పి ప్రాజెక్టును పక్కనపెట్టింది. ఖర్చును నాలుగింతలు పెంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది.
2022లో కాగ్చెప్పిన లెక్క ప్రకారం ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.1.47 లక్షల కోట్లు కావాలి. 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం అంత ఖర్చు పెట్టి ప్రాజెక్టును కట్టారు. అసలు, వడ్డీ కలిపి ఒక్క ఏడాదిలోనే ఇప్పటివరకు 16 వేల కోట్ల అప్పు చెల్లించాం. పూర్తి స్థాయి రీపేమెంట్ఇంకా మొదలు కాలేదు. అది మొదలైతే ఇంకా ఎంత చెల్లించాల్సి వస్తుందో చెప్పలేం. కేవలం కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును చేపట్టారు’’ అని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.
2014 నుంచి ఇప్పటి వరకు కృష్ణాలో మన రాష్ట్ర వినియోగం
ఏడాది వాడుకున్న నీళ్లు (టీఎంసీల్లో)
2014 227.74
2015 69.69
2016 153.39
2017 183.96
2018 207.28
2019 278.83
2020 248.23
2021 265.05
2022 277.61
2023 121.13
2024-25 286.30