ఆదివారం ( జనవరి 25 ) నిజామాబాద్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. ఫిబ్రవరిలో పోలింగ్ ఉంటుందని అన్నారు ఉత్తమ్.రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్ లో అభివృద్ధి చేస్తామని.. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం కాంగ్రెస్ కు గేమ్ చెంజర్ అని అన్నారు.
ఈ పథకాల వల్ల 85 శాతం మందికి లబ్ది చేకూరుతుందని..మరో మూడేళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందని.. రాబోయే ప్రభుత్వం కూడా తమదేనని అన్నారు మంత్రి ఉత్తమ్. నిజామాబాద్ లో గత ఎన్నికల్లో క్యాడర్ పనితీరు బాగాలేదని.. అందుకే మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. ఈసారి గెలిచే వారికే టికెట్లు ఇవ్వనున్నామని.. ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమని అన్నారు మంత్రి ఉత్తమ్.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ... నిజమాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని.. మన నిజామాబాద్ మన అభివృద్ధి పేరుతో ముందుకు వెళ్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసమే ఉత్తమ్ కు ఇంచార్జీగా బాధ్యతలు అప్పజెపాపమని అన్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామని అన్నారు.
హిందూ పేరుతో.. అరవింద్ ఎంపీ అయ్యారని.. దేవుళ్ళ పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ ది కాదని అన్నారు. దేవుడు పేరుతో ఓట్లు అడిగేవారు అభివృద్ది చేయరని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కి ఎంత దూరమో మజ్లిస్ కు అంతే దూరమని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు అబద్ధాన్ని ప్రచారం చేసి, ఇంటింటికి విషం నింపుతున్నారని అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ కోసం తొందర పడొద్దని, ప్రలోభాలతో టికెట్స్ రావని.. డబ్బులు ఎవరికి ఇవ్వొద్దని అన్నారు.
