
- రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెలలో విడుదలకు ఏర్పాట్లు: మంత్రి వాకిటి
- ఈ నెల 18న టెండర్లకు ఆహ్వానం
- రూ.122 కోట్లతో ప్రత్యేక బడ్జెట్
- 4.21 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి
- మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందునవచ్చే నెలలో చేప పిల్లల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఇందుకోసం ఈ నెల 18 న టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రి వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి, మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.122 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించిందని తెలిపారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీతో చేపల ఉత్పత్తి పెరిగి, మత్స్యకారుల ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో త్వరలో చేప, రొయ్య పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.
33 జిల్లాల్లోని 26,326 నీటి వనరుల్లో..
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 26,326 నీటి వనరుల్లో రూ. 93.62 కోట్లతో 84.62 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తామని మంత్రి శ్రీహరి వెల్లడించారు. అలాగే, రూ. 28.60 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను ఎంపిక చేసిన 300 నీటి వనరుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 6,152 మత్స్యకార సంఘాలకు చెందిన 4.21 లక్షల మంది మత్స్యకారులు నేరుగా లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు. 2025-–26 ఆర్థిక సంవత్సరం నుంచి 4.21 లక్షల మంది మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. 5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 2.5 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు రూ. 25,000 వరకు బీమా కవరేజ్ లభిస్తుందని వెల్లడించారు.