క్రీడల్లో తెలంగాణను నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

క్రీడల్లో తెలంగాణను నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి
  • ఒలింపిక్స్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా ఓరుగల్లులో స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఏర్పాటు చేశాం
  • త్వరలోనే రూ.132 కోట్లతో క్రీడా పాఠశాలకు పర్మినెంట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌
  • క్రీడల్లో రాణించే వారికి రిజర్వేషన్లు పెంచే యోచన చేస్తాం

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : క్రీడల్లో తెలంగాణను నెంబర్‌‌‌‌ వన్‌‌‌‌ చేస్తామని, ఒలింపిక్స్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా ఓరుగల్లులో స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌ ఏర్పాటు చేశామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు రిజర్వేషన్లు పెంచే యోచన చేస్తామన్నారు. హనుమకొండ జేఎన్ఎస్‌‌‌‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌ను ఆదివారం ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‌‌‌‌.నాగరాజుతో కలిసి మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగో స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌ను వరంగల్‌‌‌‌లో ప్రారంభించామని, రూ.132 కోట్ల వ్యయంతో త్వరలోనే శాశ్వత క్రీడా పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశమైన దక్షిణ కొరియా ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌‌‌‌లో 36 గోల్డ్‌‌‌‌ మెడల్స్ సాధించిందని, కానీ ఇండియా తరఫున పతకాలు ఎందుకు సాధించలేకపోతున్నామో క్రీడాకారులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం స్పోర్ట్స్‌‌‌‌ పాలసీని తీసుకొచ్చిందని, దీని ద్వారా ప్రతి జిల్లాలో అత్యాధునిక స్టేడియాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా పరికరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందన్నారు. ‘గురు వందనం’ స్కీమ్‌‌‌‌ కింద కోచ్‌‌‌‌ల కోసం మొదటి సారిగా ప్రత్యేక సంక్షేమ పథకం ప్రారంభించామని, దీని ద్వారా కోచ్‌‌‌‌లకు రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో ఫైనాన్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సిరిసిల్ల రాజయ్య, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డీవైఎస్‌‌‌‌వో అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌ పాల్గొన్నారు. 

అంతకుముందు ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌లో చేప పిల్లలు పోశారు. స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ నియోజకవర్గంలో చేప పిల్లలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.