బషీర్‌బాగ్, వెలుగు: ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. ముదిరాజ్‌లను బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–ఎ కేటగిరీలో చేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పిస్తానని పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ముదిరాజ్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు సర్పంచులుగా గెలిచిన వారందరూ భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ల ఐకత్య చాటేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, కాసాని వీరేశ్, చొప్పరి శంకర్, వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
