ప్రతి మండలానికి ఫైర్ స్టేషన్ : మంత్రి వాకిటి శ్రీహరి

ప్రతి మండలానికి ఫైర్ స్టేషన్ : మంత్రి వాకిటి శ్రీహరి
  • డీపీఆర్​ తయారు చేసి ప్రపోజల్స్​ పంపించాలి
  • జడ్చర్లలో ఫైర్​ స్టేషన్​ బిల్డింగ్​ ప్రారంభోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరి

జడ్చర్ల టౌన్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రానికి ఫైర్​ స్టేషన్​ అవసరమని, అందుకు సంబంధించిన డీపీఆర్​ తయారు చేసి పంపించాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. జడ్చర్ల పట్టణంలో కొత్తగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం జడ్చర్ల, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అగ్నిమాపక శాఖ​డీజీ నాగిరెడ్డి, కలెక్టర్​ విజయేందిర బోయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు అగ్నిమాపక శాఖకు సౌలతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.

 జడ్చర్ల పరిసర ప్రాంతాల ప్రజలకు కొత్త అగ్నిమాపక కేంద్రం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియోజకవర్గ పరిధి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్​ ఇంజన్​ వచ్చే లోపు ఆస్థి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. మండల కేంద్రాల్లో ఫైర్​ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందన్నారు. త్వరలోనే జడ్చర్లలో సమావేశం నిర్వహించి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన డీపీఆర్​  తయారు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, పాలమూరు–రంగారెడ్డి ముంపు భాధితులకు రూ.250 కోట్లు మంజూరు చేయించారన్నారు.

 జిల్లాకు చెందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలంతా ప్రజల సేవకులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పడు కరువుకు నిలయమైన పాలమూరు జిల్లాను ఇప్పుడు అభివృద్ధికి అంబాసిడర్​ గా మార్చుకుందామన్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సెట్విన్​ కేంద్రాన్ని సెట్విన్​ చైర్మన్​ గిరిధర్​ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సెట్విన్​ సెంటర్​ కోసం  ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి రూ.20 లక్షలు తన సొంత డబ్బులు వెచ్చించి బిల్డింగ్​ను సిద్ధం చేయించారని మంత్రి తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొంది మంచి స్థానానికి చేరిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.