- మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు : కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూ, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నూతన పాలకవర్గాన్ని అభినందించిన ఆయన, ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తలందరి సమష్టి కృషితో సాధ్యమైందన్నారు. గతంలో తాను మక్తల్ గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, పేదలకు సేవ చేసినప్పుడే పదవులకు సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
యువతతో కూడిన ఈ కొత్త పాలకవర్గం వార్డుల్లోని సమస్యలను శ్రద్ధగా విని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని సూచించారు. పట్టణ అభివృద్ధిలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా తన దృష్టికి తీసుకురావాలని, అందరూ కలిసికట్టుగా మక్తల్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్‌ప ర్సన్ వాకిటి మానస, వైస్ చైర్ పర్సన్ శైవి రెడ్డి, కౌన్సిలర్లను మంత్రి ఘనంగా సన్మానించారు.
