
హైదరాబాద్, వెలుగు: అధిక వర్షాల వల్ల కోతకు గురైన రోడ్లను ఇంజినీర్లు వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో ఆర్ అండ్ బీ ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంజినీర్ అలర్ట్గా ఉండాలని ఆయన ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో వాహనాల రాకపోకలు పెరిగాయని, వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న రోడ్ల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రోడ్లు పాడైన చోట పోలీస్ యంత్రాంగం సహాయంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. నార్కట్పల్లి, అద్దంకి రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై రివ్యూ చేశారు. నంది పహాడ్ క్రాస్ రోడ్ వెహికల్ అండర్ పాస్ నిర్మాణంపై చర్చించారు.
నిర్మాణ పనుల పురోగతికి ఇబ్బందిగా ఉన్న అక్కడి ఎలక్ట్రికల్ పోల్స్ తొలగింపు, మిషన్ భగీరథ పైపు లైన్ మార్పు వంటి విషయాలపై సంబంధిత శాఖ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమీక్షలో మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, నామ్ ప్రాజెక్ట్ ఎక్జిక్యూటివ్ చైర్మన్ హరికిషన్ రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. సీహెచ్ భగవాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతికి సంతాపం
ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్(52) మృతి పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం
వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి జల్ సంచయ్ అవార్డుపై మంత్రి వెంకట్ రెడ్డి హర్షం
వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ జల్ సంచయ్ జన్ భాగీదారీ జాతీయ అవార్డు సాధించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.దక్షిణ భారత జోన్‌లో ఆదిలాబాద్, మంచిర్యాలతో పాటు నల్గొండ జిల్లాలు ఉత్తమ జిల్లాల్లో ఒకటిగా నిలిచి రూ.2 కోట్ల అవార్డును గెలుచుకోవడం అభినందనీయమన్నారు.
"రాష్ట్ర ప్రజలకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు. నీటి సంరక్షణ, సమాజ భాగస్వామ్యంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు నిజంగా స్ఫూర్తిదాయకం" అని మంత్రి వెంకట్రెడ్డి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది 'జల్ సంచయ్ జన్ భాగీదారీ' (జేఎస్‌జేబీ 1.0) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందులో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవార్డులు ప్రకటిస్తున్నారు. జల సంరక్షణలో తెలంగాణ దక్షిణ భారత జోన్‌లో మొదటి స్థానాన్ని సాధించింది. ముఖ్యంగా, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ పనులు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి.