కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు : మంత్రి వివేక్

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు : మంత్రి వివేక్
  • బీఆర్ఎస్ హయాంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోలే: మంత్రి వివేక్ 
  •     నిధులు లేకున్నా ప్రొసీడింగ్స్ చూపి మోసం చేశారు 
  •     ఆర్కేఓసీపీ రెండో ఫేజ్ లో స్థానికులకు ఉపాధి 
  •     క్యాతనపల్లిలో రూ.5 కోట్ల పనులకు శంకుస్థాపన 
  •     రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జిపై లైటింగ్ సిస్టం ప్రారంభం  

కోల్​బెల్ట్, వెలుగు: గత బీఆర్ఎస్​పాలకులు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు, పెద్ద పెద్ద పనులకే ప్రాధాన్యత ఇచ్చారని, వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుని తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని10 వార్డుల్లో కలెక్టర్​కుమార్​దీపక్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డితో కలిసి రూ.5 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజల ఇబ్బందులను అప్పటి పాలకులు పట్టించుకోలేదని, కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, పెద్దపెద్ద కట్టడాలకే ప్రయారిటీ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. 

ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గత పదేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి, ప్రతినెలా సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. 

ఎంపీ, ఎమ్మెల్యేగా పని చేసిన బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం నిధులు లేకున్నా.. ప్రోసీడింగ్స్ చూపి ప్రజలను మభ్యపెట్టాడన్నారు. నిధులు ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ది చేయలేదు? ఎవరు ఆపారని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్​కు మూడో కొడుకుగా పిలిపించుకున్న సుమన్​కు నిధులు తేవడం ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. అభివృద్ధిపై సోయిలేని బీఆర్ఎస్ లీడర్లు ఫ్రస్ట్రేషన్​లో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్​లో స్థానికులకు ఉపాధి 

రామకృష్ణాపూర్ సింగరేణి ఓపెన్​కాస్ట్ రెండో ఫేజ్​లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు. చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక  ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుంటే అధిక నిధులు తీసుకువచ్చి వార్డుల్లో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. 

క్యాతనపల్లి మున్సిపల్ వార్డుల్లో ఇప్పటికే రూ.20 నుంచి 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేశామని, మరో రూ.15 కోట్లతో త్వరలో పనులు చేపడతామన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.40 కోట్లతో అమృత్ స్కీం డ్రింకింగ్ వాటర్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో ఉన్న హైటెన్షన్​ విద్యుత్ లైన్ ను మరో ప్రాంతానికి తరలించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

రూ.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు 

క్యాతనపల్లి మున్సిపాలిటీకి టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ ఫండ్స్ రూ.10 కోట్లు, నగర అభివృద్ధి నిధులు రూ.15 కోట్లు మంజూరు కాగా, మంత్రి వివేక్ బుధవారం ఆయా పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని 3, 6, 10, 11, 15, 17, 18, 19, 20, 21 వార్డుల్లో రూ.5 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, డ్రైయినేజీ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. 50 లక్షలతో క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.

ఇండ్ల జాగలకు  పట్టాలు ఇప్పిస్తా 

సింగరేణి భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల జాగాలకు పట్టాలివ్వడానికి సంబంధించి 76 జీవోపై బ్యాన్ ఉందని మంత్రి వివేక్ తెలిపారు. ఈ జీవోను పునరుద్ధరించాలని ఇప్పటికే సీఎం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇండ్లకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని, ఈ నెల 18న జరిగే కేబినెట్ మీటింగ్​లో మరోసారి ఈ విషయంపై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో కూడా పూర్తి చేయలేదని, కానీ తాను ఎమ్మెల్యే అయిన యేడాదిలోపు పూర్తి చేశామన్నారు.  

తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం, క్యాతనపల్లి రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీలను శాంక్షన్ చేయిం చానని ఆ పనులు పూర్తయ్యాయి కానీ.. ఇక్కడ పదేండ్లు ఎంపీ, ఎమ్మెల్యేగా కొన సాగిన బాల్క సుమన్ చెప్పిన పనులు మాత్రం పూర్తి చేయించలేదన్నారు. తాను, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి ఆర్వో బీ పూర్తి చేయడంపై దృష్టి సారించామని, భూసేకరణ, సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి, బ్రిడ్జి సేవలను అందుబాటు లోకి తెచ్చామన్నారు. ఆర్వోబీపై రూ.50 లక్షల నిధులతో లైటింగ్ సిస్టం ప్రారంభిం చడం ఆనందంగా ఉందన్నారు.