ఇసుకాసురుల ఆట కట్టించండి.. అధికారులకు  మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ఆదేశం

ఇసుకాసురుల ఆట కట్టించండి.. అధికారులకు  మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ఆదేశం
  •  
  •   అక్రమ రవాణా అడ్డుకోవడానికి లారీలను ట్రాక్ చేసే వ్యవస్థను బలోపేతం చేయాలి 
  •     అధికారులకు  మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ఆదేశం
  •     ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలి
  •     ఖనిజాల అన్వేషణపై నివేదికలు ఇవ్వాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి  వివేక్ వెంకటస్వామి ఆదేశించారు.  ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. శనివారం సెక్రటేరియెట్‌‌లోని తన చాంబర్‌‌లో  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) అధికారులతో మంత్రి వివేక్‌‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యత, ఇసుక తవ్వకాల నిర్వహణ, ఆదాయ పరిస్థితి, ఆదాయ వృద్ధి అవకాశాలు, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఇసుకలో అక్రమాలకు పాల్పడేవారి ఆటలు సాగకుండా నిఘా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. 

లారీల కదలికలపై నిఘా..

ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి వివేక్‌‌ ఆదేశించారు. లారీల కదలికలను నిరంతరం పర్యవేక్షించే బలమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉందని  పేర్కొన్నారు.

 ఈ సమీక్షలో టీజీఎండీసీ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి శాఖ చేపడుతున్న ఆదాయ వృద్ధి చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం, అక్రమ మైనింగ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

 ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయండి

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కీలక ఖనిజాలు  ఇతర ఖనిజాల అన్వేషణకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలపై మంత్రికి అధికారులు వివరాలు అందజేస్తూ, నివేదిక సమర్పించారు. ఖనిజాల అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రాధాన్యత గల అంశాలపై సమగ్ర నివేదికలను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

దాంతో పాటు శాండ్ బజార్ల పనితీరు, శాఖ నిఘా వ్యవస్థ, సిబ్బంది అవసరాలపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఖనిజ వనరుల సమర్థ నిర్వహణ కోసం అమలు వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతోపాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.