Chiranjeevi: నా మూవీస్ ఇప్పటికీ బతికున్నాయంటే అది మణిశర్మే వల్లే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో చిరు ఎమోషనల్..

Chiranjeevi: నా మూవీస్ ఇప్పటికీ బతికున్నాయంటే అది మణిశర్మే వల్లే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో చిరు ఎమోషనల్..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన ,‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ డ్రామాను ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఐటీ హబ్ నేపథ్యంలో ప్రేమ, కెరీర్ కలల మధ్య సాగే అందమైన భావోద్వేగ ప్రయాణంగా ఈ సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు తనవంతుగా బూస్ట్ ఇవ్వడానికి మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరై అదరగొట్టేశాడు. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, వాటిని మరింత పెంచేలా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర బృందానికి తన మద్దతు ప్రకటిస్తూ, ఈవెంట్‌లో పాల్గొని ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. దీంతో ఈ ఈవెంట్ అభిమానుల సందడితో ఘనంగా జరిగింది.

చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ..‘‘ఈ ఫంక్షన్కు నేను రావడానికి ప్రధాన కారణం నా అభిమానులే. ఈ చిత్ర నిర్మాతలు SKN, బేబీ డైరెక్టర్ సాయిరాజేశ్‌, ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు రవి నంబూరి అందరూ నా అభిమానులే. హీరో కిరణ్‌ మాత్రం పవన్‌ కల్యాణ్‌ అభిమాని. నా ఫ్యాన్స్ ని నేను ఎప్పుడూ ప్రేమిస్తాను.. కానీ, నన్ను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి, అందరూ గర్వించేలా మారితే వాళ్లను నా ప్రాణప్రదంగా చూసుకుంటాను.

అలా ఎస్.కె.ఎన్ & సాయి రాజేష్ సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చి, ఏమీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి విజయం సాధించారు. SKN నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని పిఆర్ నుంచి జర్నలిస్టుగా మొదలై గీతా ఆర్ట్స్‌తో ట్రావెల్ చేసి ఇప్పుడు సొంతంగా నిర్మాతగా మారారు. తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సాయి రాజేష్ రెండు నేషనల్ అవార్డ్స్ సాధించి నా అభిమానుల్లో తలమానికంగా నిలిచాడు. అందరూ కలలు కనాలి. రాత్రి వేళ కాకుండా పగలే కలలు కని, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నమ్మకంతో కష్టపడితే అనుకున్నది సాధించవచ్చని యువతకు’’ చిరు సందేశం అందించారు. 

నెక్స్ట్ డోర్ బాయ్ కిరణ్: రాయచోటి నుంచి వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కిరణ్ మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త రక్తం రావాలి! "నేను వచ్చినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ నా రూట్ నేను క్రియేట్ చేసుకున్నా. యువత కంఫర్ట్ జోన్ వదిలి పగలే కలలు కని సాధించాలి!" 

మణిశర్మ, అనంత శ్రీరామ్‌లపై ప్రశంసలు..

‘పెద్ది’ సినిమాకి అనంత శ్రీరామ్ ఒక్కడే సింగిల్ కార్డ్‌పై అన్ని పాటలు రాశారు. ఈ ‘చెన్నై లవ్‌స్టోరీ’కి కూడా ఆయనకే సింగిల్ కార్డ్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆయన అద్భుతమైన రచయితే కాదు, గొప్ప వక్త కూడా.  ఇక నా సినీ ప్రయాణంలో సంగీత దర్శకుల పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా నా డ్యాన్స్‌లను మరో స్థాయికి తీసుకెళ్లింది మ్యూజిక్ మాత్రమే. మణిశర్మ నా సోదరుడిలాంటి వ్యక్తి. 'మణి.. మై బ్రదర్.. లవ్ యూ సో మచ్'.. నిజం చెప్పాలంటే ఆయన అందించిన అద్భుతమైన సంగీతం వల్లే ఇప్పటికీ నా సినిమాలు బతికి ఉన్నాయి" అని చిరు ఎమోషనల్ అయ్యారు.  

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..‘‘నేను హీరోగా నటించిన సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరవడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ఆయన మా కార్యక్రమానికి రావడమే మా చిత్ర బృందానికి గొప్ప ప్రోత్సాహం. చిరంజీవి అనేది కేవలం ఒక పేరు కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. ఆయన ఆశీస్సులు, ప్రోత్సాహం మా సినిమాపై మరింత బాధ్యతను పెంచాయి. ఈ ప్రేమ, ఆదరణకు జీవితాంతం రుణపడి ఉంటాను’’అని ఎమోషనల్ అయ్యారు కిరణ్.