బీఆర్ఎస్కు వందల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయ్?.రూ.980 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఎక్కడివి?: మంత్రి వివేక్

బీఆర్ఎస్కు వందల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయ్?.రూ.980 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఎక్కడివి?: మంత్రి వివేక్
  • ఎమ్మెల్యే శ్రీగణేశ్​​ దీక్షకు మంత్రి వివేక్ సంఘీభావం
  • ఉద్యమ టైమ్​లో ఆ పార్టీ దగ్గర పైసా లేదు
  • పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నరు
  • కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం కట్టిన్రు
  • మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావే అని ధీమా
  • మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లిలో పర్యటన

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు:  పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో పైసా లేని బీఆర్ఎస్​కు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? ప్రాంతీయ పార్టీ అయిన ఆ పార్టీకి రూ.980 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఎక్కడి నుంచి.. ఎలా వచ్చాయి?’’అని వివేక్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. చెన్నూరు వార్డుల్లో మార్నింగ్ వాక్​చేస్తూ.. ప్రజలను సమస్యలు అడిగితెలుసుకున్నారు. అమృత్ స్కీం డ్రింకింగ్ వాటర్ సప్లై నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ భవనాన్ని ఆయన పరిశీలించారు. 

అనంతరం ఆదర్శనగర్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామకృష్ణాపూర్ పార్టీ ఆఫీస్​లో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేయాలని ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ‘‘కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద బిల్డింగ్​లు కట్టి కోట్లు దండుకున్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయినా.. ప్రజలకు మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నది. పదేండ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి.. రెండేండ్లలో చేసి చూపించినం’’అని వివేక్ అన్నారు. 

రూ.40వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో పెట్టిన్రు

కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని, అది చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ లీడర్లు ఫ్రస్టేషన్​తో మాట్లాడుతున్నారని మంత్రి వివేక్ అన్నారు. ‘‘పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రూ.40వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో పెట్టారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోని కేసీఆర్.. బడా కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డిని ప్రపంచంలో ధనవంతుడిని చేశాడు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్​ఎస్ పార్టీ లోక్​సభ, అసెంబ్లీ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది’’అని వివేక్ అన్నారు. 

చెన్నూరుకు కొత్త బొగ్గు గని వస్తున్నది

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్​ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ సర్కార్​ అడ్డుకున్నదని మంత్రి వివేక్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి కొత్త బొగ్గు గనులు దక్కించుకోవడానికి సింగరేణి వేలంలో పాల్గొనేలా తాను కృషి చేసినట్లు చెప్పారు. త్వరలోనే చెన్నూరు నియోజకవర్గానికి కొత్త బొగ్గు గని రానున్నదని, ఫిబ్రవరిలో జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో 800 మెగావాట్ల మూడో యూనిట్​కు సీఎం భూమిపూజ చేస్తారని చెప్పారు. వీటితో 5వేల మందికిపైగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 

ప్రొసీడింగ్స్ చూపించి మోసం చేసిండు

ఎంపీ, ఎమ్మెల్యేగా పదేండ్లు ఉన్న బాల్క సుమన్.. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి వివేక్ మండిపడ్డారు. ‘‘నిధులు ఇవ్వకుండానే ప్రొసీడింగ్స్ చూపించి ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలు మోసం చేశాడు. కేసీఆర్ సన్నిహితుడని.. కేటీఆర్​కు తమ్ముడినంటూ ప్రచారం చేసుకున్నడు. 

నిధులు తీసుకొస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదు? చెన్నూరు సెగ్మెంట్​కు సంబంధించిన డీఎంఎఫ్​టీ, సీఎస్ఆర్ ఫండ్స్​ను సిద్దిపేట, సిరిసిల్లకు తరలించాడు. నేను ఎమ్మెల్యే అయ్యాక డీఎంఎఫ్ టీ, సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయించిన. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ముల్కల నుంచి బెల్లంపల్లికి గోదావరి శాశ్వత పథకం మంజూరు చేయించారు’’అని వివేక్ అన్నారు. 

మిషన్ భగీరథ స్కీమ్ ఫెయిల్


మిషన్ భగీరథ స్కీం ఫెయిల్ అయిందని, చుక్కనీరు కూడా ఇవ్వలేదని మంత్రి వివేక్ విమర్శించారు. ‘‘చెన్నూరు సెగ్మెంట్​లో విశాక ట్రస్టు ద్వారా 300 బోర్లు వేసి నీటి ఎద్దడి తీర్చినం. క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో తాగునీటి కోసం రూ.100 కోట్లతో అమృత్​స్కీం పనులు చేపట్టినం. 

మరో 6 నెలల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తాం. చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో వందల కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు, డ్రింకింగ్ వాటర్ సప్లై లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. చెన్నూరు 14వ వార్డులో అయ్యప్ప టెంపుల్ కమ్యూనిటీ హాల్, 15వ వార్డులో విశ్వకర్మ కమ్యూనిటీ హాల్​కు రూ.30 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నం. పట్టణంలో కొత్తగా 30 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తున్నం. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా. టికెట్​ రాని వాళ్లు నిరాశ పడొద్దు. వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి’’అని వివేక్ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే శ్రీగణేశ్​​ దీక్షకు మంత్రి వివేక్ సంఘీభావం


సికింద్రాబాద్​కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేశ్​​కు మంత్రి వివేక్ వెంకటస్వామి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడారు. కంటోన్మెంట్​ను హైదరాబాద్​లో విలీనం కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ విలీనం చేస్తేనే స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు లభిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేశ్​ దీక్ష విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. విలీనం చేసేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు