ఆటలో గెలుపు ఓటములు సహజం.. ఓటమికి కుంగిపోకూడదు: మంత్రి వివేక్

ఆటలో గెలుపు ఓటములు సహజం.. ఓటమికి కుంగిపోకూడదు: మంత్రి వివేక్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సాహిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాలుగవ (U-15) సబ్ జూనియర్స్ పురుషులు, అమ్మాయిల స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్‎షిప్ సెమీ ఫైనల్ పోటీలకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ బాక్సింగ్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 

బాక్సింగ్ చాలా మంచి ఆట కానీ ఆడటం చాలా కష్టమన్నారు. ఈ బాక్సింగ్ మీట్‎లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బాక్సర్స్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని.. బాక్సర్స్ అందరికి క్రీడాస్ఫూర్తి ఉండాలని సూచించారు. ఓటమితో మన లోపాలు ఏంటో తెలుసుకుంటామని.. అందుకే ఓటమికి కుంగిపోకుండా స్పోర్టివ్‎గా తీసుకోవాలని హితవు పలికారు.

ప్రముఖ బాక్సర్ మొహమ్మద్ ఆలీ ఒక స్ట్రాటజీతో ఆడేవారని.. అలాగే ఇప్పుడున్న యంగ్ బాక్సర్స్ కూడా ఎవరి కొత్త స్ట్రాటజీతో వారు ముందుకు సాగాలన్నారు. తెలంగాణ బిడ్డ, బాక్సర్ నిఖత్ జరీన్ రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతో పాటు 600 గజాల ఇంటి స్థలం ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. యువ బాక్సర్లు నిఖత్ జరీన్‎ను రోల్ మోడల్‎గా తీసుకోవాలని సూచించారు.