
జూబ్లీహిల్స్/ ముషీరాబాద్, వెలుగు: వృత్తిలో నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన వారికి గుర్తింపు, గౌరవం తప్పక లభిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో శృతిలయ ఫౌండేషన్, సిల్ వెల్ కార్పొరేషన్ కలిసి నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరై వివిధ మీడియా రంగంలో పనిచేస్తున్న పలువురికి పురస్కారాలను అందించి, మాట్లాడారు. ఎంతో ఒత్తిడితో మీడియా రంగంలో పనిచేస్తూ ప్రజల అభిమానం పొందుతున్న వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.
అన్నపూర్ణ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా తమ తండ్రి కాకా వెంకటస్వామి సహకారం అందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కోవిద ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అనుహ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.