ఓల్డ్‌సిటీ/ హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తు తరాలకు జ్ఞాన సంపదను అందించేందుకు గ్రంథాలయాల్లోని పాత పుస్తకాలను డిజిటలైజ్చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. గురువారం అప్జల్ గంజ్ లోని స్టేట్ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న పరిస్థితులతో మనం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ యుగంలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు గ్రంథాలయ సంస్థ కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
గ్రంథాలయ సంస్థకు రావాల్సిన నిధులను ముఖ్యమంత్రితో మాట్లాడి ఇప్పిస్తానని తెలిపారు. నేటితరం పిల్లలకు గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీకి చాలా ప్రాముఖ్యత ఉందని.. తన తండ్రి కూడా విద్యా విజ్ఞానం కోసం ఏదైనా అవసరం ఉంటే.. అఫ్జల్ గంజ్ లైబ్రరీకి వెళ్లమని సూచించే వారని గుర్తు చేసుకున్నారు. రాబోయే రెండేండ్లలో తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడిగా, వెంకటస్వామి బాటలో నడిచిన మంత్రి వివేక్ .. ఉద్యమంలో ఎలా అయితే తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేశారో.. అదేవిధంగా గ్రంథాలయాల్లో మార్పులకు కూడా అదే విధంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సంస్థాన్ ఏర్పాటుకు భాగ్యరెడ్డి గ్రంథాలయాల ద్వారానే ఉద్యమాన్ని నడిపించారని ఆయన పేర్కొన్నారు.
ముగింపు కార్యక్రమంలో ఢిల్లీ పోలీస్ శాఖలో ఉన్నతాధికారి లాల్బద్, హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కే ఉపేందర్ రెడ్డి, గ్రంథాలయాల డైరెక్టర్ శ్రీహరి, అప్జల్ గంజ్ లోని స్టేట్ గ్రంథాలయ అధికారిణి అపర్ణ, రాణి, రవి తదితరులు పాల్గొన్నారు.
తప్పులన్నీ చేసి రాజకీయ కుట్ర అనడం కరెక్ట్ కాదు.. కేటీఆర్‌పై వివేక్ ఫైర్
ఫార్మూలా ఈ రేస్ కేసులో కేటీఆర్ తప్పులన్నీ చేసి.. ఇప్పుడు రాజకీయ కుట్ర అని ఆరోపించడంలో అర్థం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని బట్టి ఆయనపై చర్యలు తీసుకోవచ్చని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. కేటీఆర్ దోషి అని తేలితే శిక్ష పడుతుందన్నారు. తమ ప్రభుత్వం ఎవరిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడదని, ఈ రెండేండ్లలో ప్రతిపక్ష పార్టీ నేతలపై ఏనాడూ అలాంటి కక్ష సాధించలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఇన్చార్జిగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ను గురువారం మంత్రి వివేక్ వెంకటస్వామి గాంధీ భవన్ లోమర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నందున పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లోనూ రిపీట్అవుతుందని, ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు కాంగ్రెస్ దేనని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా పాలనను అందిస్తున్నామని, తమ ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
