
- తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం
- హైదరాబాద్ అభివృద్ధిలో జైపాల్ పాత్ర ఎంతో ఉంది
- మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి
- జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రులు, ప్రముఖులు
హైద్రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత జైపాల్‌రెడ్డి రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శమని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా పీవీఎన్ ఆర్ మార్గ్‌లోని జైపాల్‌రెడ్డి స్మారకం స్తూపం స్ఫూర్తి స్థల్ వద్ద ఈ రోజు మంత్రులు, ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడి నుంచి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారన్నారు.
ఆయన నిరంతరం డెమోక్రసి గురించి కొట్లాడారని, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో ఆయన పోరాటం చేసిన తీరు గొప్పదన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన తమకు సలహాలు అందించారన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఒత్తిడిలో కూడా విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌డ్డి మాట్లాడుతూ తాము కొత్తగా పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు జైపాల్‌రెడ్డి వద్ద పార్లమెంటరీ విధానం గురించి తెలుసుకున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ఆయన ఎంపీలకు సలహాలిచ్చే వారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మెట్రోతో పాటు ఇతర ప్రాజెక్టులను అందించి అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే అన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పూర్తిస్థల్ వద్ద నివాళులర్పించి మాట్లాడారు. జైపాల్‌రెడ్డి నాయకుడు మాత్రమే కాదు మంచి విమర్శకుడు కూడా అన్నారు. కేంద్ర మంత్రిగా మంచి విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అవినీతిని సహించని వ్యక్తి జైపాల్ రెడ్డి అన్నారు.