విభేదాలు వీడి ప్రజల్లో ఉండండి..కాంగ్రెస్ నాయకులకు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన

విభేదాలు వీడి ప్రజల్లో ఉండండి..కాంగ్రెస్ నాయకులకు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన

జూబ్లీహిల్స్, వెలుగు : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి మెలిసి పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సోమవారం సోమాజిగూడలోని ఆయన నివాసంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు. 

కొంత కాలంగా రెండు వర్గాలుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు భవానీ శంకర్‌‌ను ఒకచోట కలిపారు. వారి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ సందర్బంగా వివేక్‌ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలందరు ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.

 ప్రతి బస్తీలో పర్యటిస్తూ అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. రానున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా.. అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, బస్తీల్లో, కాలనీలో అర్హులందరికీ పథకాలు అందజేసే బాధ్యత మనందరిపై ఉందని ఆయన వెల్లడించారు.