దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం:మంత్రి వివేక్ వెంకటస్వామి

దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం:మంత్రి వివేక్ వెంకటస్వామి
  • చెప్పుకోడానికి ఏమీలేకనే తప్పుడు ప్రచారం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఈసీ స్పష్టత ఇచ్చినా రాద్ధాంతం చేస్తున్నది  
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత  బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్ 
  • కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్‌‌లోనూ రిపీట్: పొన్నం 
  • పదేండ్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్‌‌ది: తుమ్మల

హైదరాబాద్, వెలుగు: దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లే ఇప్పుడు ఉన్నాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలు డివిజన్లలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు. 

ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఉప ఎన్నికల ఇన్‌‌‌‌చార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తమ్మల నాగేశ్వర్ రావుతో పాటు మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో చెప్పేందుకు ఏమీ లేకపోవడంతోనే దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. 

‘‘జూబ్లీహిల్స్‌‌‌‌లో ఏవో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. ఓటర్ లిస్టులను కాంగ్రెస్ తయారు చేయదు. ఈసీ తయారు చేస్తుంది. గతంలో ఉన్న ఆ 43 ఓట్లు ఇప్పుడూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కొత్తగా ఆ ఓట్లు రాలేదు. 

దీనిపై ఈసీ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే. కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే. అయినా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ మాటలను నమ్మే పరిస్థితి లేదు. గత పదేళ్లుగా ఆ పార్టీని నమ్మి మోసపోయామనే ...గత అసెంబ్లీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు” అని పేర్కొన్నారు.  

బీఆర్ఎస్ చేసిందేమీ లేదు.. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని మంత్రి వివేక్ అన్నారు. ‘‘గత పదేండ్ల పాటు రాష్ట్రంలో రావణాసురుడి పాలన సాగింది. దాన్ని తెలంగాణ ప్రజలందరూ చూశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ‘కారు..సారు..పదహారు’ అని గొప్పగా ప్రచారం చేసుకున్నా సున్నా సీట్లు ఇచ్చారు. పదేండ్ల పాలనలో రాష్ట్రానికి బీఆర్ఎస్ ఒరగబెట్టింది ఏమీలేదు. రెండేండ్లలో మేం ఎంతో చేశాం. 

గత రెండు నెలల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..యువకుడు, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఉత్సాహంగా పనిచేసే శక్తివంతమైన నేత. నవీన్ గెలిస్తే అసెంబ్లీలో జూబ్లీహిల్స్ తరఫున ఒక బలమైన గొంతు ఉంటుంది. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. 

ఈ నియోజకవర్గంలోని గోకుల్ థియేటర్ దగ్గర ఒక కార్మికుడి దీనస్థితిని ఆనాడు చూసి చలించిపోయిన కాకా వెంకటస్వామి..కేంద్ర మంత్రి హోదాలో ఆ వెంటనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి కార్మికుల సంక్షేమానికి పాటుపడ్డారు” అని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత కూడా తాము ఇక్కడే ప్రజల మధ్య ఉంటామని, ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. కాగా, ప్రజలతో కలిసి చాయ్ తాగిన వివేక్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

దొంగ ఓట్లు మాకు అక్కర్లేదు: పొన్నం 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ గూబ గుయ్యిమన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితమే ఇప్పుడు జూబ్లీహిల్స్‌‌‌‌లోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, దొంగ ఓట్లు కాంగ్రెస్‌‌‌‌కు అవసరం లేదన్నారు. ‘‘చనిపోయిన బాధ ఎవరికైనా ఉంటుంది. 

కానీ రాజకీయ వేదికలపై కన్నీరు కార్చి సానుభూతితో ఓట్లు సంపాదించుకోవాలని అనుకోవడం సరైంది కాదు. మాగంటి గోపీనాథ్ భార్య, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను ఏడువుమని ఆ పార్టీ నేతలే ప్రోత్సహిస్తున్నారు. సునీతపై మాకు సానుభూతి ఉంది. అయితే బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం ఆమెను ఏడువుమని కేటీఆర్, హరీశ్ రావు ఇబ్బంది పెడుతున్నారు” అని అన్నారు. 

మళ్లీ దోచుకోవాలని బీఆర్ఎస్ చూస్తున్నది: తుమ్మల 

పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్‌‌‌‌ది అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మండిపడ్డారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌‌‌‌లో గెలిచి మళ్లీ దోచుకోవాలని  చూస్తున్నదని ఫైర్ అయ్యారు. ‘‘ఒక మహిళను రోడ్డు మీదకు తీసుకువచ్చి కన్నీళ్లు పెట్టించి బీఆర్ఎస్ నాటకాలు చేస్తున్నది. తద్వారా జనంలో సానుభూతి పొందాలని చూస్తున్నది” అని అన్నారు.