బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కారుకు ఓటేస్తే కమలానికి వేసినట్టే: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కారుకు ఓటేస్తే కమలానికి వేసినట్టే: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్రం అనుమతివ్వట్లే
  • కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను బీజేపీ కాపాడుతున్నదని ఫైర్  

హైదరాబాద్, వెలుగు:బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్‌‌‌‌కు ఓటు వేస్తే, అది పరోక్షంగా బీజేపీకి వేసినట్లేనని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం షేక్‌‌‌‌పేట్ డివిజన్‌‌‌‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌‌‌కు మద్దతుగా నిర్వహించిన సభలో వివేక్ మాట్లాడారు. 

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన అన్నారు. ‘‘గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ 8 సీట్లు కట్టబెట్టింది. దానికి బదులుగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌‌‌‌కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి మద్దతు పలికింది. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. ఒకవేళ సీబీఐ విచారణ జరిపితే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారని తెలిసే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిని కాపాడుతోంది” అని మండిపడ్డారు. 

కేటీఆర్ చేసింది శూన్యం.. 

పదేండ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందే మీ లేదని మంత్రి వివేక్ మండిపడ్డారు. ‘‘మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారు. షేక్‌‌‌‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదు’’ అని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పిలిస్తే పలికే యువ నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌‌‌ను గెలిపించి, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు.