జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఎలాంటి డెవలప్‌మెంట్ జరగలేదని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని చెప్పారు. తన గొప్పల కోసం సినిమా ఇండస్ట్రీ నటులతో కేటీఆర్ టైంపాస్ చేశారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. శనివారం షేక్‌పేటలోని మధురాహిల్స్‌లో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారికి స్థానిక ముస్లిం నాయకులు స్వాగతం పలికారు. అనంతరం కొందరు ముస్లిం నాయకులు డివిజన్‌లో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ముస్లిం నేతను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే.. బీఆర్ఎస్ నాయకులు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, అవన్నీ కొనసాగుతున్నాయని చెప్పారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడంతో ఆ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలిచిందన్నారు. కాళేశ్వరం స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించి.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తే... బీజేపీ మాత్రం ఇంతవరకూ కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నప్పటికీ నగరంలో ఎమ్మెల్యే లేకపోవడంతో అది సాధ్యపడలేదని చెప్పారు.
ఎట్టకేలకు ముస్లిం నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఇవ్వలేనన్ని రాష్ట్ర చైర్మన్ పదవులను ముస్లిం నేతలకు కేటాయించి వారిని కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకుంటే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌వల్లే అప్పుల కుప్పగా రాష్ట్రం: గడ్డం వంశీ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రమిస్తున్నారని, గల్లీ గల్లీ తిరిగి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా పనిచేస్తున్నారని ఎంపీ గడ్డం వంశీ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి జూబ్లీహిల్స్అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటివరకూ సుమారు రూ.150 కోట్లకుపైగా విలువైన పనులు ప్రారంభమయ్యాయని, ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఈ నియోజకవర్గం అత్యంత సుందరంగా మారుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు. అయినా.. ప్రజా పాలనలో అభివృద్ధి పనులు చేస్తూనే.. అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు చెప్పారు.
గంగపుత్రులకు అండగా ప్రభుత్వం: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించేందుకు పలు వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం షేక్ పేటలోని ఫిషరీస్ విమెన్ కార్పొరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాల హక్కులు, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్.. ప్రజలను పట్టించుకోవడం మరిచిపోయిందన్నారు. కేవలం వారి ఆస్తుల సంపాదన కోసం మాత్రమే ప్రాజెక్టుల పేరుతో నిర్మాణాలు చేపట్టి.. కమీషన్లకు కక్కుర్తి పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల్లో గంగపుత్ర సమాజం మొత్తం నవీన్ యాదవ్‌కు మద్దతు పలకడం హర్షణీయమని పేర్కొన్నారు.
