జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ,బీఆర్ఎస్ లు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అక్టోబర్ 25న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. షేక్ పేట డివిజన్లోని వినోభా నగర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు వివేక్. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే... మీకు కావాల్సిన పనులు చేయిస్తామని చెప్పారు.
ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అందిస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ కు వస్తే రోడ్లు ఎందుకు వేయలేదో బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని సూచించారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనన్న మంత్రి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ సపోర్టు చేస్తుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఢిల్లీలో దోస్తానా ఉందన్నారు. అందుకే గత పార్లమెంట్ ఎన్ని కల్లో బీఆర్ఎస్, బీజేపీకి సపోర్ట్ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
