- కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
- అవినీతి జరిగిందని స్వయానా అమిత్‌షా, నడ్డా చెప్పారు
- నెలకు రూ.10కోట్లతో సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
- భీమారంలో రూ.4.40 కోట్లతో
- బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కోల్‌బెల్ట్/జగిత్యాల, వెలుగు:
సింగరేణి సంస్థను కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని, కార్మికుల శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో, మందమర్రి మున్సిపాలిటీలో మంత్రి పర్యటించారు. భీమారం మండలం గెర్రాగూడెం నుంచి కాజుపల్లి వరకు రూ.4.40 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, మందమర్రిలో బెతెస్తా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కొత్త చర్చి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నిర్వహించే బొగ్గుగనుల వేలంలో సింగరేణిని పాల్గొనకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందని, దాంతో కొత్త బొగ్గు గనులు రాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని సింగరేణి కొత్త బొగ్గుగనులు దక్కించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ఫేజ్--2 కోల్ మైన్ మంజూరు అయిందని చెప్పారు. సింగరేణికి బకాయి పడిన రూ.25 వేల కోట్లు చెల్లించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్మికసంఘాలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
- కేసీఆర్ కమీషన్ల వల్లే రాష్ట్రం అప్పులపాలు
కాళేశ్వరం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని, అందులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వయిరీ చేయించాల్సిన బాధ్యత బీజేపీ సర్కార్‌దేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని స్వయానా కేంద్రమంత్రులు అమిత్‌షా, నడ్డా చేసిన విమర్శలను గుర్తుచేశారు. కేసీఆర్ కమీషన్లు, అవినీతి వల్లనే రాష్ట్రం అప్పులపాలయ్యిందన్నారు.
నెలకు రూ.10 కోట్లు ఖర్చు పెడ్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మడంలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినా కట్టుకోలేని పేదవారికి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరులో ఇప్పటి వరకు 400 బోర్లు వేశామని, త్వరలో చెన్నూరుకు బస్ డిపో తెస్తానని చెప్పారు. భీమారంలో పీహెచ్సీ సెంటర్ పెట్టామని, చెన్నూరులో ఏటీసీ సెంటర్ నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ యువతకు జర్మనీలో 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో 1/70 చట్టం అమలులో ఉన్నందున ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అడ్డంకిగా మారిందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడానని, త్వరలో ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మందమర్రిలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సౌకర్యాల పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రిని చర్చి నిర్వాహకులు జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యులు సన్మానించారు.
అంతకు ముందు మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లు తుంగపిండి రాజలింగు, మారుతీ ప్రసాద్, డీఈ సమతీ ఇతర ఆఫీసర్లతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష జరిపారు. చెన్నూరు మండలం కిష్టంపేటలో పెళ్లి చేసుకోనున్న కాంగ్రెస్ మహిళ లీడర్ మల్లక్క మనవడు మహేశ్, -శైలజలను ఆశ్వీరాదించారు. మందమరిలో వడదెబ్బతో మృతి చెందిన బండారి రాజేశ్ గౌడ్
కుటుంబాన్ని పరామర్శించారు.
- ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం
లక్ష్మినరసింహ స్వామి కొలువైన ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఏటీసీ సెంటర్లు మంజూరు చేస్తామని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన ధర్మపురి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రిగా తొలిసారి ఆలయానికి వచ్చిన వివేక్ వెంకటస్వామికి స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత్ రావు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఈవో శ్రీనివాస్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ ఆగమశాస్త్రానికి అనుగుణంగా సమగ్ర మాస్టర్ ప్లాన్‌తో ఆలయాన్ని అభివృద్ధి
చేస్తామని చెప్పారు.
- శంకర్‌పల్లి బాధితులకు అండగా ఉంటాం: వివేక్
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్సీసీలిమిటెడ్ కంపెనీలో క్రేన్ కూలి చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం శంకర్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఘటన గురించి అధికారులను ఆరా తీయగా.. సోమవారం సాయంత్రం వర్షం, గాలి దుమారం సమయంలో 17 మంది కార్మికులు షెడ్‌లోకి వెళ్లి, తలదాచుకోగా క్రేన్ కూలడంతో ఐదుగురు చనిపోయారని, మరో 12 మందికి గాయాలయ్యాయని వివరించారు. క్రేన్ కూలి ఐదుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌సీసీ లిమిటెడ్ డైరెక్టర్ మోహన్ బాబు, ఆర్డీవో పార్థసింహా రెడ్డి, తహసీల్దార్ సురేందర్తోకలిసి ఎన్‌సీసీ హెడ్ ఆఫీస్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిగి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. మరోవైపు, క్రేన్ కూలి చనిపోయిన ఐదుగురు మృతుల కుటుంబాలకు సంస్థ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు భరించడంతో పాటు తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు ఇస్తామని తెలిపింది.

