- పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు..
- కొత్త అవకాశాలపై అన్వేషణ
హైదరాబాద్, వెలుగు: కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం జర్మనీకి ఐదు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్‌తో పాటు తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (టామ్‌కాం) ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి బృందం హానోవర్, హామెలిన్, బెర్లిన్ నగరాలను సందర్శించనుంది. ఈ సందర్భంగా అక్కడి ప్రముఖ సంస్థలను పరిశీలిస్తూ, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చలు జరపనున్నారు. అదేవిధంగా సెమినార్లు, రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొని నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, వర్క్‌ఫోర్స్ మొబిలిటీ వంటి అంశాలపై చర్చించనున్నారు. జర్మనీలోని భారత రాయబారిని కూడా ఈ సందర్భంగా కలవనున్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణ యువతకు కొత్త రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించే మార్గాలను అన్వేషించడం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.
