పరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టండి..యాజమాన్యాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం

పరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టండి..యాజమాన్యాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం
  • సిగాచి పరిశ్రమ సేఫ్టీకి రూ.20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే 53 మంది చనిపోయేవారు కాదు
  • ఆ ప్రమాదం నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి
  • రెడ్ కేటగిరీ కంపెనీలను గుర్తించి నోటీసులు ఇస్తామని వెల్లడి
  • ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై యాజమాన్యాలు దృష్టి పెట్టాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. ఇటీవల పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం నుంచి మేనేజ్​మెంట్లు పాఠాలు నేర్చుకోవాలని.. కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పారు. కెమికల్  అండ్​  ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో ఉద్యోగ భద్రతపై గురువారం జూబ్లీహిల్స్  ఎంసీహెచ్ ఆర్డీలో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్​ను మంత్రి వివేక్​ వెంకటస్వామి  ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమ ప్రమాదం తర్వాత రాష్ట్రంలోని అన్ని ఫ్యాక్టరీల్లో భద్రతపై  డైరెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీ  అధికారులు రిపోర్ట్ ఇచ్చారని.. ఎక్కడ సమస్యలు, లోపాలు ఉన్నాయో ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారని తెలిపారు. సిగాచి పరిశ్రమలో భద్రతకు అవసరమయ్యే ఖర్చు రూ. 20 లక్షల కంటే ఎక్కువ దాటదన్నారు. సిగాచి పరిశ్రమ సేఫ్టీకి రూ. 20 లక్షలు ఖర్చు చేయకపోవటంతో  53 మంది ప్రాణాలు పోయాయని, కంపెనీకి రూ. 50 కోట్ల నష్టం వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రమాదానికి మేనేజ్​మెంట్​తోపాటు బోర్డు సభ్యుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ రెడ్​ కేటగిరీ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే కేటగిరీ)లో ఉందని, గత ఏడాది డిసెంబర్ లో  ఇన్​స్పెక్టర్ ఆఫ్  ఫ్యాక్టరీస్  అక్కడికి వెళ్లి తనిఖీలు చేసి మేనేజ్ మెంట్ కు రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఈ రిపోర్ట్ ను  తాను చదువగా.. ఫ్యాక్టరీలో లోపాలన్నీ అందులో ఉన్నాయని పేర్కొన్నారు.  

“కంపెనీలో సేఫ్టీ ఎన్విరామెంట్ ఉన్నప్పుడే వర్కర్స్ పని చేయగలుగుతారు. మేనేజనెంట్ ఎప్పుడూ వర్కర్ సేఫ్టీ కోసం ఇన్వెస్ట్​మెంట్ చేయాలి. ఆ వాతావరణం కల్పిస్తే మంచి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీస్ గా కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలి. ఈ అంశంపై అన్ని పరిశ్రమలు దృష్టి పెట్టాలి” అని ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే, భద్రతా చర్యలు తక్కువ ఉన్న రెడ్  కేటగిరీ కంపెనీలను గుర్తించి నోటీసులు ఇస్తామని చెప్పారు. ప్రతి నెల వర్కర్స్ కు సేఫ్టీ మీద ఒక రోజు కొంత టైం శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.