కోల్‌బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి గొప్ప ఆలోచనతో దేశం ప్రపంచశక్తిగా ఎదిగేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు.
77వ గణతంత్ర వేడుకల్లో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ క్యాంపు ఆఫీసులో మాట్లాడుతూ.. కుల, మత, వర్గాలను ఏకం చేసి మన లక్ష్యాన్ని చేరుకోవడమే రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప అవకాశమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశాభివృద్దికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.
భారత ప్రజలకు హక్కులతో పాటు విధులను గుర్తుచేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించి, అందరికీ ఉపాధి కల్పించడమే మన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. 1970లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదం స్ఫూర్తిగా దేశంలో పేదరికం పారద్రోలి అందరికి ఉద్యోగాలు కల్పించేదుకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఫారెస్ట్ పర్మిషన్లు రాగానే గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తం..
కోటపల్లి మండలం రాజారం, నక్కలపల్లి గ్రామాలకు అటవీ పర్మిషన్లు వచ్చిన వెంటనే రోడ్లను నిర్మిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. రాజారం గ్రామంలో శ్రీలక్ష్మీదేవర ఆలయంలో నిర్వహించిన బోనాల జాతరలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 25 ఏండ్లుగా రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజారం, నక్కలపల్లి గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని తనను కోరినట్లు చెప్పారు.
అటవీ ప్రాంతం కావడంతో రోడ్ల నిర్మాణానికి పర్మిషన్లు రావడం కష్టమవుతుందన్నారు. సమస్య పరిష్కారానికి కలెక్టర్, అటవీ శాఖ ఆఫీసర్లతో తరచూ చర్చిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి రెండు గ్రామాల్లో రోడ్లు నిర్మించాల్సిన అవశ్యకత గురించి వివరించారన్నారు.
ఫిబ్రవరి 1న పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను తాను, ఎంపీ వంశీకృష్ణ మరోసారి కలిసి అటవీ పర్మిషన్లపై మాట్లాడతామని చెప్పారు. పర్మిషన్లు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లే ప్రాంతంలో సీసీ రోడ్డుకు రూ.5 లక్షలు, ఒక బోరు మంజూరుకు హామీ ఇచ్చారు.
గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబసభ్యులను మంత్రి కలిసి అభినందించారు. అంతకుముందు చెన్నూరు మున్సిపాలిటీలోని 17వ వార్డు బట్టిగూడెలోని శ్రీ లక్ష్మీదేవార ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు కేటాయిస్తామని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు. మంత్రి వెంట చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారీ, కాంగ్రెస్ లీడర్లు, సర్పంచులు ఉన్నారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా..
రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియాను మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడం మనందరి లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మరో రెండేండ్లలో దేశం
ప్రపంచశక్తిగా ఎదుగుతూ మూడో స్థానానికి చేరుకుంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఐఎంఎఫ్)లో పేర్కొనడాన్ని మంత్రి గుర్తుచేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను కాపాడుకుంటూ ప్రపంచంలో గుర్తింపునకు కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్–2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, సాంకేతికత, సుస్థిరత, అందరినీ కలుపుకుపోయే అభివృద్ధిపై దృష్టి సాధించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, యువత, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
