చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక బజార్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక బజార్  ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా నడిచేదని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం వచ్చాక ఇసుక దందాను అరికట్టామని అన్నారు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 2025 నవంబర్ 19న నియోజక వర్గంలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట సమీపంలో ఇసుక బజార్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు మంత్రి. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గత ప్రభుత్వం ఉన్నపుడు వేలాది లారీలు రోడ్ల మీద ఉండేవని.. రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టి ఇసుక మాఫియా నడిపారని విమర్శించారు. నాయకులు కమీషన్ ల కోసం ఇసుక అక్రమ రవాణా చేశారని అన్నారు. ఇసుక దందా బంద్ చేస్తానని తాను ఎన్నికల్లో హామీ ఇచ్చానని.. చెప్పిన మాట ప్రకారం ఇసుక దందాను అరికట్టానని తెలిపారు. కావాలనే కొంత మంది నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇంకా మంత్రి ఇలాకాలో ఇసుక దందా నడుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దందా ఎవరు చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక శాఖ లో 18 శాతం ఎక్కువ ఆదాయం పెరిగిందని తెలిపారు మంత్రి వివేక్. కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని .. ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ పథకాల్లో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ లో రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీద ప్రజలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. 

రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా లేని రేషన్ కార్డులు తమ ప్రభుత్వం వచ్చాక  ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తుందని.. 8 వేల ఇండ్లకు మంజూరు వచ్చాక 5 వేల ఇండ్లు బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకోవడం జరిగిందని తెలిపారు. 

చెన్నూరు నియోజకవర్గంలో విద్య,  వైద్యం పైన దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. సోమనపల్లిలో రూ.200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. చెన్నూరు డిగ్రీ కళాశాల కు రూ.2 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ కాలేజీ లో కూడా 1.5 కోట్లు మంజూర్ చేయడం జరిగిందని అన్నారు.  ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడి 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

గ్రామాల్లో సోలార్ లైట్లు కావాలని కోరుతున్నారు.. వెంటనే వాటికి నిధులు మంజూరు చేస్తాము. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాము.. ఆటోలు కూడా వెళ్లలేని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పనులు చేసుకున్నాము.. పత్తి కొనుగోళ్ల ఆంక్షలపై ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.. అని చెప్పారు మంత్రి వివేక్.