అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం : మంత్రి వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం : మంత్రి వివేక్ వెంకటస్వామి

       చెన్నూరులో అంబేద్కర్​ కమ్యూనిటీ భవనం ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు పట్టణంలో రూ.20 లక్షల డీఎంఎఫ్​టీ ఫండ్స్​తో నిర్మించిన అంబేద్కర్​కమ్యూనిటీ భవనాన్ని కలెక్టర్ కుమార్​దీపక్, దళిత సంఘాల లీడర్లతో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 ఏండ్లుగా అంబేద్కర్​ భవనం కోసం చెన్నూరు దళితులు, దళిత సంఘాలు డిమాండ్ ​చేస్తున్నాయని, ఇప్పుడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

భవనాన్ని ఎక్స్​టెన్షన్ చేసేందుకు మరో రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. భీమారంలో అంబేద్కర్ భవనం, జైపూర్​లో జగ్జీవన్​రాం భవనం, చెన్నూరులో ముదిరాజ్​భవనాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. స్థలాలు ఉంటే అన్ని కుల సంఘాలకు అవసరమైన భవనాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.50కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు లోని నాన్​వెజ్​ మార్కెట్ ​నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్​ను తొలగించిన కొత్త వారితో పనులు చేయించాలని కలెక్టర్, మున్సిపల్​ఆఫీసర్లను ఆదేశించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న పబ్లిక్​ హెల్త్ ​డీఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులపై చెన్నూరు మున్సిపల్​ఆఫీస్​లో కలె క్టర్, మున్సిపల్​ కమిషనర్ ​మురళీకృష్ణతో రివ్యూ నిర్వహించారు