- విద్యార్థులు పెద్ద లక్ష్యాలతో అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత
- చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
మెదక్(చేగుంట)/ సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడితే అత్యున్నత స్థానాలను చేరుకోవచ్చన్నారు. ష్యూరీఫై స్కూల్కిట్స్ఆధ్వర్యంలో మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివి ఐఐటీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. చేగుంట పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందడం ఉపాధ్యాయుల నిబద్ధతకు నిదర్శనమన్నారు. విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం అభినందనీయమన్నారు.
సందర్భంగా విద్యాభివృద్ధికి సేవలందిస్తున్న సంకల్ప్ సంస్థను మంత్రి అభినందించారు. తన తండ్రి వెంకటస్వామి స్ఫూర్తితోనే సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావన అలవడిందని చెప్పారు. వ్యాపారంలో విజయం సాధించిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్, ఇతర మౌలిక వసతులు కల్పించడం ప్రారంభించానన్నారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఏఐ విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తోందన్నారు. చేగుంట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాలేజీ మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, చేగుంట సర్పంచ్ స్రవంతి, ఉపసర్పంచ్ రఫి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్రావు, ఎంఈఓ నీరజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్, ష్యూరీఫై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సంకల్ప్ సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, సతీశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కష్టకాలంలో కలిసికట్టుగా కదలాలి
ఎల్ నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇలాంటి కష్టకాలంలో అందరూ కలిసికట్టుగా కదలాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. కాంటిజెన్సీ ప్రణాళికపై శనివారం సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున, అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. టామ్‌కామ్ ద్వారా ఇప్పటి వరకు 5 వేల మందికి జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించినట్టు మంత్రి చెప్పారు. జర్మనీలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఆసక్తి గల 100 మంది రిజిస్టర్ చేస్తే జర్మన్ భాషలో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జర్మనీలో ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సమావేశంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
యాబై వేల టీచర్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసినట్టు మంత్రి వివేక్ వెల్లడించారు. నారాయణరావు పేట మండలంలోని జక్కాపూర్ జడ్పీ హైస్కూల్ లో డైనింగ్ హాల్ ని మంత్రి ప్రారంభించారు. అనంతరం స్టేట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్లకు అభినందనలు తెలిపారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యం
రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం సిద్దిపేటలో ముస్లిం ఖబ్రస్తాన్ కోసం 2.03 ఎకరాల భూమి పట్టాను అందజేశారు. సిద్దిపేటలో ముస్లిం స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నేతలు పూజల హరికృష్ణ, అత్తు ఇమామ్, సూర్య వర్మ తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మెదక్ జిల్లా చేగుంట రైతు వేదికలో శనివారం నిర్వహించిన ‘ఎల్ నినో వాతావరణ పరిస్థితులు.. ప్రత్యామ్నాయ పంటలు’ అనే కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఎల్ నినో కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. కాబట్టి వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.
