
సంగారెడ్డి, వెలుగు: దళిత జాతి కోసం నిర్విరామంగా పని చేస్తానని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దళిత సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. మంత్రి హోదాలో వివేక్ సంగారెడ్డికి మొదటిసారి వచ్చిన సందర్భంగా బుధవారం వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, దళిత సంఘాల నాయకులు ఐబీలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఇన్ చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు దళిత జాతి వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నిరంతరం పనిచేస్తానన్నారు.అంతకుముందు జిల్లా తరపున కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ మంత్రికి బొకే ఇచ్చి స్వాగతం పలికారు.
బోనాలతో స్వాగతం
జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు హాజరైన మంత్రి వివేక్ కు మహిళా సంఘాల సభ్యులు బోనాలతో స్వాగతం పలికారు. బతుకమ్మ ఆట పాటలతో సంప్రదాయబద్ధంగా సభా వేదిక వరకు మంత్రిని స్వాగతించి వేదికపై సన్మానించారు. అనంతరం నేపాల్ కు చెందిన స్వయం సహాయక బృందం సభ్యులు మంత్రి వివేక్ ను కలిశారు. మహిళల సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు కారు డ్రైవింగ్ నేర్పడానికి తన వంతు సాయంగా నిధులు కేటాయిస్తానన్నారు.
కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. దీనిపై మంత్రి వివేక్ స్పందించారు. విదేశాల నుంచి డబ్బు వచ్చాక మహిళల ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని, ఆ హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని అందుకు మీరు కూడా ప్రయత్నించాలని నవ్వుతూ చురకలు అంటించారు.
కార్మిక మంత్రిని కలిసిన టీఎన్జీవో జిల్లా సంఘం
సంగారెడ్డి టౌన్: ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఉద్యోగుల పాత్ర కీలకమని మంత్రి వివేక్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, స్థానిక సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పాలనను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఉద్యోగుల సహకారం నిరంతరాయంగా అందిస్తామని సంఘం తరఫున మంత్రికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కార్యదర్శి వేల్పూర్ రవి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకటేశం, యాదవరెడ్డి, షకీల్, విజయ్, సాయి, వేణుమాధవ్, రమేశ్ ఉన్నారు.