యువతకు ఏటీసీలు శ్రీరామరక్ష..100 శాతం ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌, లక్షల్లో ప్యాకేజీలే మా లక్ష్యం:మంత్రి వివేక్

యువతకు ఏటీసీలు శ్రీరామరక్ష..100 శాతం ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌, లక్షల్లో ప్యాకేజీలే మా లక్ష్యం:మంత్రి వివేక్
  • ఏఐతో ఉద్యోగాలు పోతున్న ఈ టైమ్‌‌‌‌లో టెక్నికల్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ నేర్చుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  •      ఐటీఐ, ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న యువతకు రూ.2 వేల స్టైపెండ్‌‌‌‌ ఇస్తం
  •     యువతకు 100 శాతం ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌, లక్షల్లో ప్యాకేజీలే మా లక్ష్యం
  •     సీఎన్‌‌‌‌సీ యంత్రాలు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి రంగాల్లో ట్రైనింగ్​
  •     మీడియా ప్రతినిధులు, అధికారులతో కలిసి మల్లేపల్లి ఏటీసీ సెంటర్‌‌‌‌‌‌‌‌ సందర్శన

హైదరాబాద్, వెలుగు:  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌వేర్ రంగంలో కోడింగ్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ కొలువులు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో.. కంప్యూటర్లు, అధునాతన యంత్రాలను నడిపించే ప్రాక్టికల్ నైపుణ్యాలు (టెక్నికల్ స్కిల్స్) ఏటీసీల్లో నేర్చుకోవడమే యువతకు శ్రీరామరక్ష అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం హైదరాబాద్‌‌‌‌ మల్లేపల్లిలోని అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను మీడియా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాలు, రోబోటిక్స్ ల్యాబ్‌‌‌‌లను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించి, శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక యంత్రాలపై శిక్షణ అందించడం ద్వారా దేశ విదేశాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 

ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న పేద విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రతి స్టూడెంట్‌‌‌‌కు నెలకు రూ.2,000 చొప్పున స్టైపెండ్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. స్టైపెండ్ పొందాలంటే విద్యార్థులకు 80 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధనను విధించినట్లు మంత్రి తెలిపారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీఐలకు ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకుండా, కాలం చెల్లిన పాత యంత్రాలతో నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో దాదాపు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్‌‌‌‌గ్రేడ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఇక్కడ సీఎన్‌‌‌‌సీ యంత్రాలు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వంటి అధునాతన రంగాల్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఐలను ఏటీసీలుగా ఆధునికీకరించి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

100 శాతం ప్లేస్‌‌‌‌మెంట్లే లక్ష్యం..

జర్మనీ పర్యటనలో భాగంగా అక్కడ దాదాపు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలో వృద్ధుల జనాభా పెరిగిపోయి యువత కొరత వేధిస్తోందని, దీనిని మన యువతకు అనుకూలంగా మార్చుకునేందుకు జర్మనీలోని తురింగియా స్టేట్ ప్రెసిడెంట్ మినిస్టర్ నేతృత్వంలోని 60 మంది ప్రతినిధుల బృందం హైదరాబాద్ వచ్చి సీఎంతో చర్చలు జరిపినట్లు వివరించారు. 

ఈ మేరకు సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఐటీఐ విద్యార్థులను తరగతి గది పాఠాలకే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేలా ప్రముఖ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ‘ఆన్ ది జాబ్ ట్రైనింగ్’ (ఓజేటీ)తో పాటు అప్రెంటిస్ చట్టం కింద ఏడాది పాటు పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తామని, దీనివల్ల కోర్సు పూర్తి కాగానే ఆయా కంపెనీల్లోనే 100 శాతం ప్లేస్‌‌‌‌మెంట్ లభించేలా ప్రణాళికలు రెడీ చేశామని వివరించారు. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏటీసీల్లో వ్యవసాయ ఆధారిత కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీసీలలో ప్రవేశాల కోసం ఇప్పటికే అడ్మిషన్ల పోర్టల్‌‌‌‌ను కూడా ప్రారంభించామని, ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 33 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 

    సెక్రటేరియెట్‌‌‌‌లో జపాన్‌‌‌‌ బృందంతో మంత్రి వివేక్‌‌‌‌ భేటీ

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో జపాన్‌‌‌‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌‌‌‌కు చెందిన ప్రతినిధి బృందం మంత్రితో భేటీ అయింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌పవర్ కంపెనీ (టామ్‌‌‌‌కామ్) సమన్వయం చేసిన ఈ సమావేశంలో.. రెండు ప్రాంతాల మధ్య నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ప్లేస్‌‌‌‌మెంట్లు, మానవ వనరుల మార్పిడిపై చర్చించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జపాన్ సాంకేతిక నైపుణ్యం, యంత్రాల కచ్చితత్వంతో పాటు అక్కడి ప్రజల క్రమశిక్షణ, పని సంస్కృతి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా రాష్ట్ర యువతను తీర్చిదిద్దడంలో టామ్‌‌‌‌కామ్‌‌‌‌ పనిచేస్తోందని కొనియాడారు. తెలంగాణ- హిరోషిమా ప్రిఫెక్చర్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు వీలుగా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ప్రతిపాదించారు. హిరోషిమా ప్రిఫెక్చర్ నారా జపాన్ హబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జపాన్‌‌‌‌కు చెందిన ఇండస్ట్రియల్ హ్యూమన్ రిసోర్సెస్ డివిజన్ డైరెక్టర్ ఫునైషి హిరోయోషి, సిబ్బంది కోగా యుయా, లోకల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్రమోషన్ డివిజన్ సూపర్‌‌‌‌వైజర్ హరజోనో యోషిహిరో, సిబ్బంది టోయి మారియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.