జీడీపీ లెక్కలు కాదు ప్రజల ఆదాయాలే అభివృద్ధి: మంత్రి వివేక్

జీడీపీ లెక్కలు కాదు ప్రజల ఆదాయాలే అభివృద్ధి: మంత్రి వివేక్
  • ఎంసీఆర్ హెచ్ఆర్డీ జాతీయ సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి  
  • స్కిల్స్ ఉంటేనే సుస్థిర ఆర్థిక వృద్ధి
  •     రూ.4 వేల కోట్లతో 65 ఐటీఐలు ఏటీసీలుగా మార్పు
  •     జర్మనీ, జపాన్​లలో మనోళ్లకు ఫుల్ డిమాండ్ 
  •     యువత అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు

 

హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక ప్రగతి, యువతలో నైపుణ్యాల పెంపుతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని, అప్పుడే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆర్థిక వృద్ధి అంటే కేవలం జీడీపీ లెక్కలు పెరగడం మాత్రమే కాదని, అది అన్ని ప్రాంతాలు, వర్గాలకు చేరి ప్రజల ఆదాయాలు పెరగడంతో పాటు యువతకు ఉపాధి, ప్రభుత్వానికి సంక్షేమ నిధులు సమకూరినప్పుడే అసలైన వికాసం సాధ్యమని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా 8 శాతం స్థిరమైన వృద్ధిరేటు అవసరమని, ఇందుకు ఏఐ, పరిశోధనలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పరిశ్రమల్లోని నైపుణ్యాల కొరతను తీర్చేందుకు రూ.4 వేల కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా  మార్చామని, వచ్చే ఏడాదిలో మరో 54 ఏటీసీలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇండస్ట్రీ నిపుణులతో సంప్రదింపులు జరిపి సిలబస్ ఖరారు చేయడంతో పాటు ఫ్యాకల్టీకి ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పిస్తూ విద్యాసంస్థలు–పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తొలగిస్తున్నామని వివరించారు.

మల్టీ స్కిల్స్​ నేర్చుకోండి

జర్మనీ, జపాన్ వంటి అగ్రదేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంతో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్​ పెరుగుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. యువత ఆయా దేశాల సాంకేతిక ప్రమాణాలు, భాషలు, పని సంస్కృతి, క్రమశిక్షణపై పట్టు సాధించి అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని సూచించారు. విదేశాల్లో ఉపాధి పొందడం ద్వారా అధిక ఆదాయంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు.పోటీ ప్రపంచంలో ఒకే నైపుణ్యంతో నెట్టుకురావడం సాధ్యం కాదని, నేటి తరం నిరంతరం చదువుతూ  మల్టీ స్కిల్స్ పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సరికొత్త విషయాలు నేర్చుకునే జిజ్ఞాసను, వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు.  ఐదు దశాబ్దాలుగా శిక్షణ రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. 

సదర్ సమ్మేళనానికి మంత్రి వివేక్​కు ఆహ్వానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రీకృష్ణ సదర్‌‌‌‌ సమ్మేళన ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామిని ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌‌‌‌ కుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఆహ్వానించారు. శనివారం మంత్రిని కలిసిన ఆయన సదర్‌‌‌‌ వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు. యాదవ సామాజిక వర్గ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నవంబర్‌‌‌‌ 4న లోయర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌లోని ఎన్టీఆర్‌‌‌‌ స్టేడియంలో వైభవంగా నిర్వహించనున్నట్టు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ వేడుకలకు హాజరై ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని సాదరంగా ఆహ్వానించారు.