- పదేండ్లలో జూబ్లీహిల్స్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలే: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ప్రజాపాలనలో 200 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించినం
- నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ఇదే ఊపుతో ముందుకెళ్తామని వెల్లడి
- షేక్ పేట డివిజన్లోని పలు కాలనీల్లో ప్రచారం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సుమారు రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇన్చార్జి మంత్రిగా గత మూడు నెలలుగా షేక్ పేటలో ప్రజలు అడిగిన రోడ్డు, డ్రైనేజీ వంటి సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేయించానని చెప్పారు. నియోజకవర్గంలోని షేక్ పేట అంబర్లి హైట్స్ వాసులతో ఆదివారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని.. తాను ఇన్చార్జి మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతంలో కోటి 40 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేయించానన్నారు.
జూబ్లీహిల్స్ లోని అన్ని డివిజన్లకు సుమారు రూ. 200 కోట్ల నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఇక్కడ ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 11న జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి షేక్‌పేట డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం అక్కడి నుంచి షేక్‌పేటలోని విరాట్ నగర్లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. విరాట్ నగర్లో గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారని.. నేడు అలాంటి సమస్యలు తొలగిపోయే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
లక్ష్మీ నగర్ కాలనీలో మంత్రి ప్రచారం
షేక్‌పేట డివిజన్ లక్ష్మీ నగర్ కాలనీలోని అసోసియేషన్ సభ్యుల సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాలనీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీలు, కాలనీల అభివృద్ధిని మరిచిందన్నారు. ప్రజా పాలన ఆధ్వర్యంలో కాలనీలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పోలీసు వ్యవస్థ కూడా మెరుగుపడిందని ఆయన తెలిపారు.
రెండేండ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ జూబ్లీహిల్స్‌లో ఇంత మార్పును తీసుకొచ్చామని.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇదే వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాయ మాటలను నమ్మకుండా రానున్న ఎన్నికలో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవాలని అసోసియేషన్ సభ్యులను కోరారు. అక్కడి నుంచి వినోబా నగర్ చేరుకున్న మంత్రి.. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కరపత్రాలు పంచారు. ఈ కాలనీ నుంచి నూరు శాతం ఓట్లు కాంగ్రెస్ గుర్తుపై పడాలని ఆయన స్థానిక ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఫయీమ్ ఖురేషి , ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
