
- 38 వేల కోట్లతోనే ప్రాణహిత-చేవెళ్ల పూర్తయ్యేది
- కానీ.. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టింది
- ‘మేఘా’ కమీషన్ల కోసమే మెగా ప్రాజెక్టులు కట్టారని ఫైర్
సిద్దిపేట/ములుగు, వెలుగు: గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టి, ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని మండిపడ్డారు. ‘‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతో తెలంగాణలో తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని ఆనాడు కాకా వెంకటస్వామి చెప్పడంతో.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో దాన్ని ప్రారంభించారు.
రూ.11 వేల కోట్ల పనులు కూడా పూర్తి చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమీషన్ల కోసమే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజక్టును కాళేశ్వరంగా మార్చారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టారు. కానీ ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు. మేఘా కంపెనీ కమీషన్ల కోసమే మెగా ప్రాజెక్టులు కట్టారని అప్పుడే నేను చెప్పాను. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి నుంచే నీళ్లిచ్చే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఎల్లంపల్లి ప్రాజక్టుతో 17 లక్షల ఎకరాలకు నీళ్లందాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. దీని ద్వారా వంద మీటర్లు పంపింగ్ చేయాలంటే కరెంట్ బిల్లులకే రూ.4 వేల కోట్లు అవుతుంది” అని వివేక్ అన్నారు.