కేంద్రం వల్లే యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేంద్రం వల్లే యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్ర అవసరాల్లో సగం కూడా సరఫరా చేయలే: వివేక్ వెంకటస్వామి
  • రిపేర్ల పేరుతో రామగుండం ఫర్టిలైజర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని మూతపెడుతున్నరు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా హామీలను అమలు చేస్తున్నం
  • మెదక్‌‌‌‌, సిద్దిపేట, దుబ్బాకలో కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తల మీటింగ్‌‌‌‌కు మంత్రి హాజరు


మెదక్/చేగుంట, సిద్దిపేట రూరల్/దుబ్బాక, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యల వల్లే రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఏడు లక్షల టన్నుల యూరియా అవసరం కాగా.. అందులో 50 శాతం మాత్రమే ఇప్పటివరకు కేంద్రం సప్లై చేసిందన్నారు. తెలంగాణలో యూరియా కొరత ఉండకూడదన్న ఆలోచనతో తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి పీఎం మన్మోహన్ సింగ్‌‌‌‌తో మాట్లాడి రూ.10 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేయించి మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించిన విషయం గుర్తుచేశారు. 

ఆ ఫ్యాక్టరీని రిపేర్ల పేరిట తరుచూ 10, 15 రోజుల పాటు బంద్‌‌‌‌ పెడుతున్నారని, దానివల్ల ప్రొడక్షన్ జరగక యూరియా కొరత ఏర్పడుతోందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెగా కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి.. సొంత ఆస్తులు పెంచుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని, దాని మీద నెల నెల రూ.5 వేల కోట్లు వడ్డీ కడుతున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. 12 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని, మళ్లీ తాము వచ్చాకే పేదలకు ఇండ్లు కట్టిస్తున్నట్టు వివేక్‌‌‌‌ చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో రేషన్‌‌‌‌ కార్డు ఇచ్చారే తప్ప కొత్త కార్డులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని, అన్నా చెల్లెళ్లు ఆస్తి కోసం కొట్లాడుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌‌‌‌లో చేరుతామని చాలామంది నాయకులు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గల్లీలో కాదు.. ఢిల్లీలో ధర్నా చేయండి..

యూరియా కొరతపై గల్లీలో కాదు.. ఢిల్లీలో ఉన్న వాళ్ల దోస్త్ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ధర్నా చేయాలని బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డికి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై యూరియా కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సిద్దిపేట, దుబ్బాకలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి యూరియా సంచులను కొంతమంది నిల్వ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొందరు రైతులు యూరియా బస్తాలను ఇండ్లల్లో డంప్ చేశారన్నారు. 

యూరియా పక్కదారి పట్టకుండా ఫర్టిలైజర్ షాపులపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. నియోజకవర్గాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడికి వచ్చిన తనకు ప్రజలు పెద్ద ఎత్తున వినతులు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, అలాగే, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి పూజల హరికృష్ణ, నాయకులు అత్తు ఇమామ్, గంప మహేందర్, బొమ్మల యాదగిరి, షోబోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.