సిద్దిపేటలో ఇక బిఅర్ఎస్ అడ్రస్ గల్లంతే : మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేటలో ఇక బిఅర్ఎస్ అడ్రస్ గల్లంతే : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • హరీశ్​ను ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట రూరల్/కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: సిద్దిపేటలో బీఆర్ఎస్​ను లేకుండా చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావును ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఉమ్మడి మెదక్​జిల్లా ఇన్​చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట ప్రజలు బీఆర్ఎస్  మీద, హరీశ్ రావు మీద విశ్వాసం కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్ సాన్​పల్లికి చెందిన కృష్ణమూర్తి నేతృత్వంలో గ్రామంలోని 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్​బలోపేతానికి సంబంధించి  ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్ తో చర్చలు జరిపినట్టు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించాలని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించాలని నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణకు మంత్రి సూచించారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటను కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తామని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. 

కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్ నాయకులు గంప మహేందర్, బొమ్మల యాదగిరి, కలిమోద్దీన్, దాస అంజయ్య, అంబటి మహేశ్​గౌడ్, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, సత్యనారాయణ, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  వార్డు మెంబర్లు కనకరాజు, కరుణాకర్, గిరి, సతీశ్, దుర్గారెడ్డి, మల్లేశం పార్టీలో చేరారు. 

స్థానిక ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారని.. మున్సిపల్​ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ క్లీన్​ స్వీప్ చేయడం ఖాయమని మంత్రి వివేక్​ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. సర్కారు​అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ తోనే మేలు జరుగుతుందని నమ్మి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​కు పట్టం కట్టారన్నారు. 

శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో రూ.20 లక్షల డీఎంఎఫ్​టీ నిధులతో నిర్మించిన అంబేద్కర్​ కమ్యూనిటీ భవనం, వెజిటేబుల్ మార్కెట్​ను కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి మంత్రి ప్రారంభించారు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్, ఉప సర్పంచులను క్యాంప్​ ఆఫీస్​లో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచ్​ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా బీఆర్ఎస్​ పోటీ ఇవ్వలేదని, ఆ పార్టీ మద్దతుదారులను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 

100 కోట్లతో అమృత్​ 2.0 స్కీం పనులు

 చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ఇంటింటికి నల్లానీళ్లు అందించేందుకు రూ.100 కోట్లతో అమృత్​ 2.0 స్కీం పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. వచ్చే మే నాటికి చెన్నూరులో 100 పడకల దవాఖానను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రోల్​ మోడల్​గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి అన్నారు. చెన్నూరు పట్టణ అభివృద్ధికి రూ.80 కోట్ల ఫండ్స్​ కేటాయిస్తున్నానని, రూ.15 కోట్ల టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్ కూడా మంజూరు అయ్యాయని, త్వరలో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. 

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, మాజీ మంత్రి గడ్డం వినోద్​ చొరవతో జైపూర్​లో 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటైందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఒప్పించి 800 మెగావాట్ల మూడో పవర్​ ప్లాంట్ మంజూరు చేయించానని, వచ్చే నెల భూమి పూజ చేస్తానని మంత్రి పేర్కొన్నారు.