అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా సాగాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా సాగాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా సాగాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.  నాగోల్ బండ్లగూడలోని జీఎస్ఐ (GSI) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు  జరిగాయి. జీఎస్ఐ సదరన్ రీజియన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్ఐ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులర్పించారు.

అనంతరం సభలో మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. సమాజ అభివృద్ధికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దిక్సూచి అని కొనియాడారు. ముఖ్యంగా మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో రాణించేలా అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తన సతీమణి కూడా మహిళా చైతన్యం కోసం, పేద పిల్లల విద్య కోసం అంబేద్కర్ కళాశాల ద్వారా విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో జీఎస్ఐ సేవలు బాగున్నాయని కితాబిచ్చిన మంత్రి.. సంస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఏటా 1000 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.

తన తండ్రి, దివంగత నేత గడ్డం వెంకటస్వామిని స్మరించుకుంటూ.. ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలే తమకు స్ఫూర్తి అని మంత్రి పేర్కొన్నారు. కేవలం 5 లక్షలతో వ్యాపారం ప్రారంభించి, నేడు వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుకున్నామని.. అదే క్రమంలో 5 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో పనిచేసే గంటలు ఎక్కువగా ఉంటాయని, మన దగ్గర కూడా పని గంటలు పెంచి దేశాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.