
జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జూబ్లీహిల్స్నియోజకవర్గంలోని షేక్‌పేటలో మంత్రి వివేక్ పర్యటించారు. స్థానిక నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వినోభానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారితో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. డివిజన్‌లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్థానికులు తనకు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం వెంటనే అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.