
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి వెళ్ళేవారని.. పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఉండేవని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాత్రం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కి వర్క్ ఇచ్చిన తర్వాతనే ప్రొగ్రామ్స్ చేపడుతున్నామని తెలిపారు.
శనివారం (ఆగస్ట్ 30) జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ డివిజన్లో మంత్రి వివేక్ పర్యటించారు. ఈ సంద్భంగా షేక్ పేట్ ఓయూ కాలనీలో సీసీ రోడ్, ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్స్ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.2 కోట్ల 43 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.
ఓయూ కాలనీలో డ్రైనేజ్ ఓవర్ లోడ్ అవుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. దీంతో కొత్త పైప్ లైన్ వేయాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో షేక్ పేట్ వచ్చినప్పుడు సమస్యలేమైనా ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని పబ్లిక్‌ను రిక్వెస్ట్ చేశానని గుర్తు చేశారు.
షేక్ పేట్ డివిజన్లో రూ.33 కోట్ల పనుల ప్రపోజల్స్ వచ్చాయని.. వాటన్నింటినీ శాంక్షన్ చేస్తున్నామని తెలిపారు. కాలనీల్లో డ్రైనేజ్ పైప్ లైన్స్ వేసిన తర్వాతనే సీసీ రోడ్స్ వేస్తున్నామని చెప్పారు. హైటెన్షన్ లైన్స్‌ను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. షేక్ పేట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని.. షేక్ పేట్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని పేర్కొన్నారు.