కోల్బెల్ట్, వెలుగు: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో పంట నష్టం పోయిన రైతులకు మంత్రి భరోసానిచ్చారు. వడ్ల కొనుగోళ్లు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు, వీలైనంత త్వరగా కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలన్నారు. పంటనష్టాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి.. పరిహారం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. త్వరలోనే సర్వే నిర్వహించి పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తడిసిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
