V6 News

విద్యతోనే దళితుల్లో మార్పు.. చదవండి.. చదివించండి.. చైతన్యం తీసుకురండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యతోనే దళితుల్లో మార్పు.. చదవండి.. చదివించండి.. చైతన్యం తీసుకురండి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చని వెల్లడి
  • సంగారెడ్డి జిల్లా రామ్ తీర్త్, గోపన్‌‌పల్లిలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ

సంగారెడ్డి, వెలుగు: విద్యతోనే దళితుల జీవితాల్లో మార్పు వస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చదవండి.. చదివించండి క్రమశిక్షణతో చైతన్యం తీసుకురండి అని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామ్ తీర్త్, మొగుడంపల్లి మండలం గోపన్‌‌పల్లిలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. 

అనంతరం ఆయా బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడారు. దళిత వర్గాలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్య ఒక్కటే మార్గమని, చదువుకొని ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు కనీసం ఐదుగురిని ప్రోత్సహించాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌‌‌‌ ఆ కాలంలోనే కష్టపడి చదివి 32 డిగ్రీలు సంపాదించారని గుర్తుచేశారు. రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది కూడా అంబేద్కర్‌‌‌‌ అని పేర్కొన్నారు. 

అంబేద్కర్ స్ఫూర్తితో తాము నెలకొల్పిన అంబేద్కర్ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 75 శాతం మార్కులు సాధించిన ప్రతి స్టూడెంట్‌‌కు ఫ్రీ స్కాలర్‌‌‌‌షిప్‌‌ ఇస్తున్నామని వెల్లడించారు. ఐదు స్టేట్ ర్యాంకులు సాధించగా, రాష్ట్రంలో అంబేద్కర్ ఇన్‌‌స్టిట్యూట్ నాలుగో స్థానాల్లో ఉందని చెప్పారు. పారిశ్రామిక రంగంలో కూడా గత 34 ఏండ్లుగా అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని, అందుకే టాప్ పరిశ్రమల్లో ఒకరిగా ఉన్నామన్నారు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని మంత్రి తెలిపారు. 

  • ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం..

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపిజానికి తావు లేదని, అందరూ పార్టీ కోసం పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పలువురు దళిత సంఘాల నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. 

రామ్ తీర్త్ గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మంత్రిని కోరగా.. త్వరలో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మొగడంపల్లి మండలం మడిగి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ సురేశ్​ షెట్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు. బీఆర్ఎస్ హయంలో పేదలకు డబుల్ బెడ్రూమ్‌‌ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో 225 ఇండ్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. ఆయా కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యునూస్, మహమ్మద్ తన్వీర్, దళిత సంఘాల నాయకులు నర్సింలు, శ్రీనివాస్, రామచందర్, బాలయ్య పాల్గొన్నారు.