వచ్చే వానాకాలంలో..సీతారామ నీళ్లు పారాలి: తుమ్మల

వచ్చే వానాకాలంలో..సీతారామ నీళ్లు పారాలి: తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం పంట సీజన్​కు సీతారామ లిఫ్ట్ స్కీమ్ నీళ్లు పారాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. ఆదివారం సెక్రటేరియెట్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై ముగ్గురు మంత్రులు ఇంజినీర్లతో సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వైరా ప్రాజెక్టు, లంక సాగర్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టులోని 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పనుల్లో స్పీడ్ పెంచాలని అధికారులను ఆదేశించారు.

దీంతో ఏడాదిలోనే నీళ్లు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ప్రాజెక్టులోని 3 పంపుహౌస్​ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రులకు ఇంజినీర్లు తెలిపారు. ఏన్కూరు దగ్గర లింక్ కెనాల్ పనులకు టెండర్లు త్వరగా పూర్తి చేసి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. రూ.70 కోట్లతో ఈ కాల్వ పనులు పూర్తి చేస్తే వచ్చే వానాకాలంలోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు నీళ్లిచ్చే చాన్స్ ఉందని వివరించారు.

కాలువ పనులు పూర్తి చేయాలి: తుమ్మల

ఇటీవల గండుగులపల్లిలో నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లారు. సంబంధిత పనులను దశల వారీగా ప్రాధాన్యతను బట్టి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. యాతాలకుంట భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్​కు ఈ సీజన్​లోనే సాగు నీరందించే అవకాశం ఉందని తెలిపారు. సీతారామ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

మే నెలాఖరు కల్లా అన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కు సంబంధించి భూ సేకరణకు రూ.12 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలేరు టన్నెల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాలేరు టన్నెల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ కూ నీళ్లిచ్చే అవకాశం ఉందని వివరించారు. 

నెల రోజుల్లోనే ప్రజలకు చేరువయ్యాం: మంత్రి ఉత్తమ్​

నెల రోజుల పాలనలోనే ప్రజలకు చేరువయ్యామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ఇదే నిదర్శమన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్లలో జవాబుదారీతనం, పారదర్శకతపై దృష్టి సారించామని తెలిపారు. ప్రజల పాలన ఎలా ఉండాలో నెల రోజుల్లోనే తాము చూపించామని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై సమీక్షించామని చెప్పారు. మేడిగడ్డ వద్ద ఇంజినీర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని.. వాస్తవాలను ప్రజలకు చెప్పామన్నారు. కాళేశ్వరం అవకతవకలపై సిట్టింగ్ జడ్జిని నియమించాలని హైకోర్టు చీఫ్​ జస్టిస్​ని కోరామని తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్​కు జాతీయ హోదా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు.