సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా : మంత్రులు పొన్నం, అడ్లూరి

సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా : మంత్రులు పొన్నం, అడ్లూరి
  •     మంత్రులు పొన్నం, అడ్లూరి సవాల్​

కరీంనగర్, వెలుగు: ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల్లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. రూ.1140 కోట్ల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని వారు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ఇద్దరు మంత్రులతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర నేతలు బుధవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 

ఈ సందర్భంగా బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళా ప్రయాణికులు, విద్యార్థులతో మంత్రులు ముచ్చటించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఏం జరుగుతుందో మంత్రులకు తెలియదని హరీశ్ రావు అనడం సరికాదని, గతంలో గడ్డం వెంకటస్వామి, చొక్కారావు ఎలా పనిచేశారో ఇప్పుడు తాను, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అలాగే రాజకీయాలు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ, ఎస్సీ వర్గాలకు చెందని తమపై అవహేళనగా మాట్లాడడం హరీశ్ రావు అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.