తంగళ్లపల్లి, వెలుగు: పానీపూరీ తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం కేసీఆర్ నగర్‌లో ఓ బండి వద్ద పానీపూరీ తిన్న చిన్నారులు రాత్రి నుంచే అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.
దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తొలుత తెలిసింది. కేసీఆర్ నగర్‌లో పానీపూరీ అమ్మిన వ్యక్తే అంకుశాపూర్ గ్రామంలో కూడా పానీపూరీ విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం అంకుశాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు, కేసీఆర్ నగర్‌కు చెందిన మరో బాలుడు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. దీంతో బాధితుల సంఖ్య 24కు చేరింది. ఇందులో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం 8 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు
డాక్టర్లు వెల్లడించారు.
ఘటనపై కేటీఆర్ ఆరా..
ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. డాక్టర్లు, అధికారులకు ఫోన్ చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. పానీపూరీ విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తెలిపారు.
