రైతు నిరసనలను జాతి వ్యతిరేకం అంటారా?

రైతు నిరసనలను జాతి వ్యతిరేకం అంటారా?

న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. అన్నదాతలతో కేంద్రం పలు దఫాలుగా చర్చలు నిర్వహించినప్పటికీ అవి సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో రైతు నిరసనలకు దాయాది పాకిస్తాన్, చైనా దేశాలు ఆజ్యం పోస్తున్నాయని కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ సిఖ్ బాడీ సీరియస్ అయ్యింది. దాన్వే కామెంట్స్ రైతులను అవమానించేలా ఉన్నాయని, ఇది సిగ్గుచేటు అని మండిపడింది.

‘రైతులు శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. అన్నదాతలు తమంత తాముగా పోరాడుతున్నారు. వాళ్లు దేశం కోసం చనిపోవడానికీ సిద్ధంగా ఉన్నారు. రైతులే ధాన్యాన్ని పండిస్తారు, వాళ్ల పిల్లలే దేశం కోసం అమరులవుతున్నారు. అలాంటి అన్నదాతల నిరసనలను జాతి వ్యతిరేకమైనవిగా పేర్కొనడం సబబు కాదు’ అని ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌‌మెంట్ కమిటీ (డీఎస్‌‌జీఎంసీ) పేర్కొంది.